రాములమ్మగా ప్రేక్షకులు పిలుచుకునే విజయశాంతి ఇక తెలంగాణలో కీలకపాత్ర పోషించబోతున్నారా.. వలసలతో నిర్వీర్యమై.. నిస్తేజంగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ను బతికించేందుకు, కొత్త ఉత్సాహం నింపేందుకు విజయశాంతి చేతికి తెలంగాణ కాంగ్రెస్ ను అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందా.. ఇప్పుడు ఇది తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్. 

ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్రాల విభాగాలపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. పార్టీ డల్ గా ఉన్న ప్రాంతాల్లో సినీహీరోలను, గ్లామర్ ఉన్నవారి చేతికి పగ్గాలు అప్పగిస్తోంది. యూపీలో ఇప్పటికే రాజ్ బబ్బర్ కు కాంగ్రెస్ రాష్ట్ర బాధ్యతలు అప్పగించారు. మరోవైపు తమిళనాడులో ఖుష్బూ చేతికి పార్టీని అప్పగించారు. ఇప్పుడు తెలంగాణలోనూ సేమ్ సీన్ రిపీట్ కాబోతోందట.  


తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. పేరుకు ప్రధాన ప్రతిపక్షమే గానీ.. పార్టీని ఒకే తాటిపై నిలిపే బలమైన లీడర్ ఒక్కరు కూడా లేకపోవడం పెద్ద మైనస్ పాయింట్ అయ్యింది. అందుకే తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త రక్తం నింపేందుకు హైకమాండ్ ఆలోచిస్తోందట. అందులో భాగంగానే విజయశాంతి పేరు చర్చకు వచ్చిందట.  

మరోవైపు.. ప్రముఖ క్రికెటర్ అజారుద్దీన్ పేరు కూడా పీసీసీ రేసులో ఉందట. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ తెలంగాణలో ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేన్లు ఇస్తామని హామీ ఇచ్చినా అమలు చేయడం లేదు. ఈ నేపద్యంలో ముస్లింల ఓట్ల సమీకరణకు అజారుద్దీన్ సేవలు బాగా ఉపయోగపడతాయన్న ఆలోచనలో ఉందట. ఇలా కొత్తగా నేతలను అరువు తెచ్చిపెట్టుకోవం కంటే.. పార్టీలోనే ఉన్న డి.కె. అరుణ, గీతారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ వంటి ప్రత్యామ్నాయ నేతల పేర్లు కూడా పరిశీలిస్తున్నారట. 



మరింత సమాచారం తెలుసుకోండి: