దెయ్యాలు వేదాలు వల్లించడం అన్న సామెత అందరికీ తెలుసు..ఇప్పుడు మ‌ధ్య‌ప్ర‌దేశ్ అసెంబ్లీ లో కూడా అచ్చూ ఇలాంటి వేదాలే వల్లించారు మంత్రి హోదాలో ఉన్న ఒక ప్రజా ప్రతినిధి. ఆయన అన్న మాటలకు అక్కడ ఉన్న మిగతా ప్రజా ప్రతినిధులు ముక్కుమీద వేలు వేసుకున్నారు.  వివరాల్లోకి వెళితే..మధ్యప్రదేశ్ హోంమంత్రి భూపేంద్ర సింగ్ తన వాఖ్యలతో అందరినీ దిగ్భ్రాంతికి గురి చేశారు. రాష్ట్రంలో న‌మోదవుతోన్న మ‌ర‌ణాల‌పై అధికారంలో భార‌తీయ జ‌న‌తా పార్టీని స‌మాధానం చెప్పాల‌ని ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్‌ పార్టీ శాస‌న‌స‌భ‌లో డిమాండ్ చేసింది.  దీంతో  ఆ రాష్ట్ర‌ హోం మంత్రి భూపేంద్రసింగ్.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో గ‌త రెండున్న‌రేళ్ల‌లో 400 మంది మృతి చెందార‌ని, వారిలో కొంద‌రిని దెయ్యాలు చంపాయ‌ని ఆయ‌న అధికారికంగా ప్ర‌క‌ట‌న చేశారు.  

ఆ మాట వినగానే మొదట అందరూ ఖంగు తిన్నారు.  ఒక హోంమంత్రి ఈ ప్ర‌క‌ట‌న చేయడంతో విన్న వారికి దిమ్మదిరిగిపోయింది. సాక్షాత్తూ రాష్ట్ర హోంమంత్రే ఇచ్చిన అధికారిక ప్ర‌క‌ట‌న త‌న‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచింద‌ని కాంగ్రెస్ ఎమ్మెల్యే శైలేంద్ర ప‌టేల్ అన్నారు. కొన్ని మ‌ర‌ణాల‌కు చేత‌బ‌డి, దెయ్యాలు కార‌ణ‌మ‌ని మంత్రి చెప్ప‌డం హాస్యాస్ప‌ద‌మ‌ని ఆయ‌న అన్నారు. అలాగైతే ప్ర‌భుత్వం మూఢ‌న‌మ్మ‌కాల‌ను విశ్వ‌సిస్తుందా అని అడిగితే మంత్రి మౌనం దాల్చార‌ని ఆయ‌న చెప్పారు.

 అయితే దీనిపై ఆయన సభా ప్రాంగనం బయట వివరణ ఇచ్చారు. ఎవ‌రైనా ఒక‌రు చ‌నిపోతే వారి కుటుంబ స‌భ్యుల స్టేట్‌మెంట్ రికార్డు చేస్తార‌ని, దెయ్యాల వ‌ల్లే చ‌నిపోయార‌ని వారు చెప్పిన విష‌యాన్నే తాను అసెంబ్లీలో చెప్పాన‌ని భూపేంద్ర‌సింగ్ స‌మ‌ర్థించుకున్నారు. ప్ర‌భుత్వం మాత్రం అలాంటి మూఢ‌న‌మ్మ‌కాల‌ను విశ్వ‌సించ‌ద‌ని ఆయ‌న స్ప‌ష్టంచేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: