ప్రముఖ మానవ హక్కుల ఉద్యమకారిణి, మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ చాను షర్మిల(44) తన 16ఏళ్ల సుదీర్ఘ నిరాహార దీక్షను నేటితో విరమించనుంది. ఆత్మహత్యయత్నం కేసులో జైలులో ఉన్న ఆమెను నేడు కోర్టులో ఆమెను హాజరుపరుస్తారు పోలీసులు. అనంతరం ఆమె దీక్షను నిలిపివేస్తున్నట్టు ప్రకటిస్తారు. ‘నేను దీక్ష విరమిస్తాను  రాజకీయాల్లో చేరుతున్నాను  మణిపూర్ అసెంబ్లీకి త్వరలో జరగబోయే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తాను' అని షర్మిల స్పష్టం చేశారు.44 ఏళ్ల షర్మిల 2000 సంవత్సరంలో నవంబర్ 5న నిరాహార దీక్షను చేపట్టారు. అప్పుడామె వయసు 28 ఏళ్లు. ఆ సమయంలో అస్సాం రైఫిల్స్ 10 మంది సాధారణ ప్రజలని కాల్చి చంపారు. వారిలో జాతీయ సాహస బాలుడు అవార్డు అందుకున్న అబ్బాయి కూడా ఉన్నాడు.

ఆ సంఘటన ఆమెని తీవ్రంగా కలచి వేసింది. సాయుధ బలగాలకు ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయాలంటూ నిరాహార దీక్షకు దిగారు షర్మిల. అప్పట్నించి వైద్యులు ఆమె శరీరంలోకి నేరుగా ఎక్కిస్తున్న సెలైన్, ఇతర ద్రవాల వల్లే ఆమె ప్రాణం నిలిచింది. అంతే కాదు తల దువ్వుకోనని, అద్దంలో కూడా చూసుకోనని, చివరికి తన తల్లిని కూడా కలవబోనని తనకు తాను కట్టుబాట్లు విధించుకున్నారు. వైద్యురాలు కావాలని కలలు కన్న షర్మిల తన పోరాటంతో ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్నారు. దీక్ష విరమించే క్రమంలో మంగళవారం నాడు ఉదయం తొలుత ఆమె జ్యుడిషీయల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు.

మెజిస్ట్రేట్ లో ఆమె దీక్ష విరమణ ప్రకటన చేయగానే జ్యుడీషియల్ కస్టడీ ముగిసినట్లుగా ప్రకటిస్తుంది కోర్టు. అటు తర్వాత తన మద్దతుదారులతో సమావేశం కానున్న ఇరోమ్ షర్మిల.. తన భవిష్యత్తు ప్రణాలిక గురించి చర్చించనున్నారు.   జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వివాహం చేసుకోవటానికి కూడా షర్మిల సంసిద్ధత వ్యక్తం చేసినట్లు ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆమె సుమారు ఆరేళ్లుగా భారత సంతతికి చెందిన బ్రిటిష్‌ పౌరుడు డెస్మండ్‌ కౌటిన్హో(53)తో ప్రేమలో ఉన్నారు.  త్వరలో ఆయన్నే వివామం చేసుకోబోతున్నట్లు సన్నిహితులు తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: