తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ రానురాను ప్రత్యక్ష ఉద్యమాలకు దూరమవుతోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2009లో కేసీఆర్ దీక్ష మొదలు కేంద్రం ప్రకటన తదనంతర పరిణామాల్లో టీఆర్ఎస్ పాత్ర ఎంతో కీలకమైంది. మిగతా పార్టీలు తెలంగాణపై ఏం చేసినా క్రెడిట్ అంతా టీఆర్ఎస్, కేసీఆర్ కు మాత్రమే దక్కేది. అయితే ఈ మధ్య కాలంలో టీఆర్ఎస్, కేసీఆర్ వైఖరిలో చాలా మార్పు వచ్చినట్టు స్పష్టమవుతోంది. కేవలం జేఏసీ కార్యక్రమాల ద్వారానే గులాబీ నేతలు ఉద్యమ బాట పడుతున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ కంటే పొలిటికల్ జేఏసీనే ఎక్కువగా ఉద్యమాలకు పిలుపునిస్తోంది. జేఏసీ కార్యక్రమాల్లో మిగతా పార్టీల మాదిరిగానే టీఆర్ఎస్ పాల్గొంటూ వస్తోంది. అయితే టీఆర్ఎస్ ఉద్యమ వేడిని తగ్గించడానికి అనేక కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. మరో ఏడాదిలో అసెంబ్లీ, పార్లమెంట్ కు ఎన్నికలు రాబోతున్నాయి. ప్రభుత్వాలు కూలిపోతే ఆ సమయం మరింత ముందే వచ్చే అవకాశమూ ఉంది. దీంతో ఇప్పుడు టీఆర్ఎస్ దృష్టి ఉద్యమాల కంటే ఎన్నికల మీదే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఉద్యమాల ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెచ్చామని, ఇక రాజకీయంగా ఎదిగి కేంద్రాన్ని శాసించి తెలంగాణ తెచ్చుకుంటామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆపార్టీ నేతలు చెబుతున్నారు.  అందుకే జేఏసీ నేతలతో చిన్నచిన్న విభేదాలు ఉన్నా.. వారి ఉద్యమ కార్యచరణకు పూర్తిస్థాయి మద్దతునిస్తూ వస్తోంది. వచ్చే ఎన్నికల్లో 100 అసెంబ్లీ, 15 లోక్ సభ స్థానాల గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న గులాబీ నేతలు ఆదిశగా పావులు కదుపుతూనే జేఏసీ కలిసి ఉద్యమాల్లో అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: