తాడిని తన్నే వాడుంటే... వాడి తలను తన్నే వాడుంటాడు అన్నట్టుంది ఓ నిరుద్యోగి యవ్వారం. ఎమ్మెల్యేలు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు వస్తుంటే ఏకంగా... ఆ ఎమ్మెల్యేల పీఏల నుంచే డబ్బులు గుంజేశాడు తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడికి చెందిన తోట బాలాజీ నాయుడు. జేఎన్టీయూ కాకినాడలో 2003లో బీటెక్ చదవిని బాలాజీ నాయుడు... తర్వాత విశాఖలోని ఎన్టీపీసీలో జూనియర్ ఇంజనీర్ గా చేరాడు. అక్కడ అక్రమాలకు పాల్పడడంతో ఉద్యోగం నుంచి తొలగించి జైలుకు పంపారు. ఈమధ్యనే జైలు నుంచి విడుదల అయ్యాడు. ఉన్న ఉద్యోగం పోవడంతో ఏంచేయాలో అర్థంకాక నిరుద్యోగులకు టోకరా వేయాలనుకున్నాడు. అందుకు ప్రజాప్రతినిధులు సరిపోతారని గుర్తించాడు. ఎమ్మెల్యే అయ్యాక ఉద్యోగాలు ఇప్పించాలంటూ స్థానిక ప్రజలు హైదరాబాద్ వస్తూ ఉంటారు. వారు కూడా తెలిసిన చోట ఏమైనా ఉద్యోగాలు ఉంటాయేమోనని రెకమెండ్ చేస్తూ ఉంటారు. అయితే ఇదే అదనుగా తీసుకుని... దాన్నే ఉపాధి మార్గంగా మార్చుకున్నాడు బాలాజీ. ఎమ్మెల్యేల పీఏలకే ఫోన్లు చేసి మా దగ్గర అనేక రకాల ఉద్యోగాలు ఉన్నాయి... మీవాళ్లు ఎవరైనా ఉంటే చెప్పండని నమ్మించాడు. ఇందుకోసం ప్రభుత్వం ప్రకటించిన రాజీవ్ యువకిరణాల పథకాన్ని ఆసరాగా చేసుకుని... మరికొన్ని ప్రాంతాల్లో ఆరోగ్యశ్రీ పథకం పేరును కూడా వాడుకున్నాడు. తాను రాజీవ్ యువకిరణాలు పథకం ప్రాజెక్ట్ డైరెక్టర్‌నంటూ... ఔట్‌సోర్సింగ్ కింద ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలున్నాయంటూ ఎమ్మెల్యేల పీఏలకు ఫోన్ లు చేసి మభ్యపెట్టేవాడు. ఉద్యోగం కావాలంటే 1060రూపాయల చొప్పున అప్లికేషన్ రుసుము తాను సూచించే బ్యాంకు ఖాతాలో జమచేయాలని నమ్మబలికి... స్నేహితుల అకౌంట్ లను ప్రభుత్వ ఖాతాలుగా నమ్మించాడు. బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అనుచరుడు రామ్ జగదీశ్ చేసిన ఫిర్యాదుతో పోలీసులు కూపీ లాగి.. తోట బాలాజీ నాయుడును పట్టుకున్నారు. హైదరాబాద్ బర్కత్ పురాలోని ఓ బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. బాలాజీ నుంచి 56వేల రూపాయలు రికవరీ చేశారు. విజయనగరం, బొబ్బిలి, సాలూరు, చిలకలూరిపేట, నర్సాపురం, అవనిగడ్డ తదితర నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, వారి అనుచరులతో ఫోన్‌లో మాట్లాడినట్లు బాలాజీ నాయుడు మీడియా ప్రతినిధుల ముందు అంగీకరించారు. మొత్తానికి అక్రమాలకు పాల్పడి ఉన్న ఉద్యోగం పోగొట్టుకున్న బాలాజీ నాయుడు... తన ఉపాధి కోసం సాటి నిరుద్యోగలనే టార్గెట్ చేయడం గమనించాల్సిన విషయం. 

మరింత సమాచారం తెలుసుకోండి: