రైల్వే బడ్జెట్ అనగానే గుండెల్లో రైళ్లు పరెగెడతాయి. ఇటు నెత్తిన భారం పడుతుందని సామాన్య ప్రజలు అనుకుంటుండగా, అటు ఎక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుందోనని సర్కార్ దిగులుపడుతుంటుంది. అయితే రానున్న రైల్వే బడ్జెట్ లో ఛార్జీల మోత ఖాయనని తెలుస్తోంది. రైల్వే మంత్రి పవన్‌ కుమార్‌ బన్సాల్‌ ఛార్జీల పెంపు విషయాన్ని సూచనప్రాయంగా చెప్పారు. వడ్డన త్వరలో ఉండే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. త్వరలో రానున్న రైల్వే బడ్జెట్‌లో ఛార్జీలు పెంచే ప్రతిపాదనలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పుడు బడ్జెట్ లో మళ్లీ ఛార్జీలు పెంచితే 2013 లో కొద్దిరోజుల వ్యవధిలోనే రెండోసారి ఛార్జీలు పెంచిన ఘనతను రైల్వే సొంతం చేసుకుంటుంది. నిధులు లేకపోవడం వల్ల పలు ప్రాజెక్టులు నిలిచిపోయాయని, అందువల్ల వీటిని భర్తీచేయడానికి... తప్పనిసరి పరిస్థితుల్లో ఛార్జీల పెంపునకు సిద్ధమవుతున్నట్లు రైల్వే శాఖ అంటోంది. ఫిబ్రవరి 26న పార్లమెంట్ లో ప్రవేశ పెట్టనున్న రైల్వే బడ్జెట్‌లో ఛార్జీల పెంపు తప్పకుండా ఉండే వీలుంది. పదేళ్ల తర్వాత గత నెల పెంచిన రైల్వే ఛార్జీలు జనవరి 21 నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రయాణికుల నుంచి పెంచిన ఛార్జీల రూపంలో రైల్వే శాఖ 6,600 కోట్ల రూపాయాలు పిండుకుంటోంది. కానీ నిధులు కొరత కారణంగా పలు రైల్వే ప్రాజెక్టులు నిలిచిపోవడంతో మళ్లీ ఛార్జీలపెంచాలనే నిర్ణయానికి వచ్చారు. ఈసారి ఛార్జీల పెంపుతో 1200 కోట్ల రూపాయాల ఆదాయాన్ని అందుకోవాలని అనుకుంటున్నారు. రాజధాని , శతాబ్ధి, దురంతో రైళ్లకు సైతం ఛార్జీలు పెంచనున్నారు. కాకపోతే ఫ్లాట్‌ఫామ్‌ టిక్కెట్లు పెరగవు. రెండోసారి రైల్వే ఛార్జీలు పెరిగితే.. 35 కిలోమీటర్ల దూరం వరకు సాధారణ రెండవ తరగతి సబర్బన్‌ రైళ్లకు రూ.2, సుమారు 135 కిలోమీటర్లకు నాన్‌-సబర్బన్‌ రైళ్లకు రూ.5 చొప్పున పెరగ నుంది. స్లీపర్‌ క్లాస్‌కు అయితే 770 కిలోమీటర్లకు రూ.50, ఏసీ చైర్‌ కార్‌కు అయితే 387 కిలోమీటర్లకు రూ. 40, ఏసీ త్రీ టైర్‌కు 717 కిలోమీటర్లకు రూ.76, ఏసీ టూ టైర్‌కు 721 కిలోమీటర్లకు రూ. 48, ఏసీ ఫస్ట్‌ క్లాసుకు 547 కిలోమీటర్ల దూరానికి రూ.56 చొప్పున పెరుగనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: