ప్రభుత్వ ఆస్పత్రుల్లో చిన్నారులపై అక్రమంగా నిర్వహిస్తున్న వైద్య ప్రయోగాలపై జాతీయ మానవహక్కుల సంఘం సీరియస్ అయింది. ఏళ్లుగా సాగుతోన్న ఈవ్యవహారంపై కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని ఎన్ హెచ్ ఆర్సీ ఆదేశించింది. ఈ అక్రమ వైద్య పరీక్షలు కేవలం మూరుమూల ప్రాంత ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాదు... సాక్షాత్తూ దేశ రాజధాని ఢిల్లీలో కూడా జరుగుతున్నాయని నిర్ధారణ అయింది. చిన్నారులపై తల్లిదండ్రుల అనుమతి లేకుండానే అక్రమంగా వైద్య ప్రయోగాలు జరుగుతున్నాయన్న విషయంపై.. ఓ స్వచ్ఛంద సంస్థ సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాలు విస్మయం కలిగించాయి.  స్వచ్చంద సంస్థ ప్రతినిధి సేకరించిన సమాచారం ప్రకారం సప్ధర్ జంగ్, కళావతి శరణ్, నోక్ నాయక్ జై ప్రకాశ్ ఆస్పత్రుల్లో... గత ఐదేళ్లలో దాదాపు 8వేల రెండు వందల మంది చిన్నారులపై ప్రయోగాలు జరిగాయని తేలింది. ఇందులో సప్ధర్ జంగ్ ఆస్పత్రిలో 2వేల యాభై ఆరు మంది చిన్నారులు, కళావతి శరణ్ లో వెయ్యి మంది, లోక్ నాయక్ జయప్రకాశ్ హాస్పటల్ లో నాలుగు వందల మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. చనిపోయిన వారంతా ఐదేళ్లలోపు వారేనని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.  ఈ వ్యవహారంపై ఓ స్వచ్చంధ సంస్థ ప్రతినిధులు జాతీయ మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. పిల్లలపై ప్రయోగాలు చేసే సమయంలో వారి తల్లిదండ్రుల నుంచి అనుమతి కూడా తీసుకోవడం లేదని... ఇది కూడా మానవహక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని స్వచ్చంధ సంస్థ ప్రతినిధులు తెలిపారు. స్పందించిన ఎన్ హెచ్ ఆర్సీ కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: