రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న తర్వాత ఒవైసీ సోదరులకు రాష్ట్ర సర్కారు నుంచి షాక్ మీద షాక్ తగులుతోంది. బండ్లగూడలోని ఒవైసీ ఆస్పత్రి సమీపంలో మూడున్నర ఎకరాల భూమి ఉంది. దీని పక్కనే కేంద్ర ప్రభుత్వ సంస్థ మిథానీ ఉంది. ఈ భూమిలో రెండున్నర ఎకరాలను కొందరు ప్రైవేటు వ్యక్తులు చెరపట్టారు. నకిలీ ద్రువీకరణ పత్రాలు చూపించి భూమిని హస్తగతం చేసుకున్నారు. తెర వెనక ఒవైసీ ఆస్పత్రి ప్రమేయం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. నవీన్ మిట్టల్ హైదరాబాద్ కలెక్టర్‌గా ఉన్న సమయంలో ఎన్నో ప్రభుత్వ భూములకు నిరభ్యంతర పత్రాలు ఇచ్చిన అప్రతిష్ట ఉంది.  ఆ భూమికి ఎన్ఓసీ ఇవ్వాలన్న ప్రైవేటు వ్యక్తుల అభ్యర్థనను తక్షణమే మన్నించి మిట్టల్ ఎన్ఓసీ ఇచ్చేశారు. ఇప్పుడు మిథానీ భూములపై విధించిన స్టే ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. దీంతో కోట్లు విలువజేసే భూమికి అప్పటి కలెక్టర్ నవీన్ మిట్టల్ ఇచ్చిన నిరభ్యంతర పత్రం రద్దయినట్లు సమాచారం. ఇప్పుడు ఆ భూమి సర్కారుపరమైంది! రెవెన్యూ అధికారులు అక్కడ సర్కారీ భూమి అన్న బోర్డు కూడా పెట్టేశారు. ఆ రెండున్నర ఎకరాల భూమిని ప్రభుత్వం ఒవైసీ ఆస్పత్రికి ఇవ్వాలనుకుందని, ఒవైసీలకు హామీ కుడా లభించిందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు రాజకీయ పరిణామాలు మారడంతో ప్రభుత్వానికి మిథానీ భూములపై స్టే ఉత్తర్వులను ఉపసంహరిస్తూ నాలుగు రోజుల కిందట రెవెన్యూ ముఖ్య కార్యదర్శి మీనా ఉత్తర్వులు జారీ చేశారు!

మరింత సమాచారం తెలుసుకోండి: