ఇరాన్‌ అధ్యక్షుడు మహమ్మూద్‌ అహ్మదినేజాద్‌కు ఈజిప్టు రాజధాని కైరోలో తీవ్ర పరాభవం ఎదురైంది. ప్రభుత్వ పరంగా ఘన స్వాగతం లభించినప్పటికీ సున్నీ అసమ్మతి దారుల నుంచి నిరసన ఎదురైంది. సిరియా అధ్యక్షుడు బసార్‌ అస్సాద్‌కు ఇరాన్‌ మద్దతు ఇవ్వడమే ఈ ఆగ్రహానికి కారణం. ఈ సందర్భంగా అసమ్మతిదారుడొకరు తన బూట్లు తీసి అహ్మదినేజాద్‌పై విసరడానికి ప్రయత్నించాడు. రానురాను పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఒకానొక దశలో అహ్మదినేజాద్‌ కైరోలోని పురాతన మసీదునుంచి పారిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. సున్నీ మత సంస్థ అల్‌ అజహర్‌ గేట్లను మూసివేసిన తరువాత ఇరాన్‌కు వ్యతిరేకంగా ఆందోళనకారులు తమచెప్పులు తీసి విసరడానికి ప్రయత్నించారు. ఈ సంఘటనకు ముందు మంగళవారం ఈజిప్టు అధ్యక్షుడు మోర్సీ ఇరాన్‌ అధ్యక్షుడు అహ్మదినేజాద్‌ సిరియా సంక్షోభం పై 20 నిముషాల పాటు చర్చించారు.  ఇస్లామిక్‌ సహకారానికి చెందిన 57 ప్రధాన ముస్లిం దేశాల ప్రతినిధులతో నిర్వహిస్తున్న సదస్సులో పాల్గొనడానికి అహ్మదినేజాద్‌ కైరోకు వచ్చారు. ఇరాన్‌తో ఈజిప్టు చేతులు కలపడాన్ని వారు విమర్శించారు. ఇరాన్‌ షియాత్‌కు అనుకూలంగా ఎలా వ్యవహరిస్తారని ప్రశ్నించారు. తెహరాన్‌ను ఒంటరి చేయాలని చూస్తున్న వాషింగ్టన్‌తో కానీ గల్ఫ్‌ అరబ్‌ రాజ్యాలతో కానీ కైరో సంబంధాలు పెట్టుకోరాదని హెచ్చరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: