బ్యాంకుల‌కు వేల కోట్ల రూపాయ‌ల శ‌ఠ‌గోపం పెట్టి.. విదేశాల‌కు చెక్కేసి అక్క‌డే సెటిల్ అయిపోయిన కింగ్ ఫిష‌ర్ అధినేత‌ విజ‌య్ మాల్యా తాను తిరిగి ఇండియాకు వ‌స్తానంటూ కోర్టును ఆశ్ర‌యించాడు. ఇక ఎట్టి  ప‌రిస్థిత్తుల్లోనూ భార‌త్‌కు రానని స్ప‌ష్టం చేసిన మాల్యాకు ఉన్న‌ట్టుండి భార‌త్‌కు రావాల‌ని మ‌నసు మ‌ళ్లింద‌ట‌. ఇన్నాళ్లు దేశం విడిచి పారిపోయిన ఆయ‌న తిరిగి వ‌స్తాన‌ని చెప్ప‌డంతో బ్యాంకులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నాయి. మ‌రోప‌క్క‌ మాల్యా ప్ర‌క‌ట‌న వెన‌క ఆంత‌ర్య‌మేంటో తెలియ‌క తిక‌మ‌క ప‌డుతున్నారు.


ఇండియాకు తిరిగి వ‌చ్చేందుకు తానెంతగానో ఎదురు చూస్తున్నానని ఓ ప్ర‌క‌ట‌న చేశారు. అంతేకాదు భారత ప్రభుత్వం రద్దు చేసిన తన పాస్ పోర్టును పునరుద్ధరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పాస్ పోర్టు లేకపోవడం వల్లే తాను భారత్ కు రాలేకపోతున్నట్టు చెప్పుకొచ్చారు విజ‌య్ మాల్యా. ఇప్పటికైనా ప్రభుత్వం తన పాస్ పోర్టును పునరుద్ధరించేలా చూడాలని కోరుతూ ఢిల్లీ లోని పాటియాలా కోర్టుకు మాల్యా దరఖాస్తు చేసుకున్నట్టు స‌మాచారం.


 అదేసమయంలో 2000 సంవత్సరం నాటి ఫెరా ఉల్లంఘన కేసును కూడా ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోర్టును అభ్యర్థించినట్టు తెలుస్తోంది. మరి మాల్యా అభ్యర్థనలపై కోర్టు ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి. బ్యాంకుల‌ను నిండా ముంచార‌ని మాల్యాపై దేశ వ్యాప్తంగా పలు కేసులు నమోదయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన ఈడీ.. ఆయన ఆస్తులను గుర్తించి జప్తు చేయడం ప్రారంభించింది. ఈ లిక్కర్ కింగ్ కు సంబంధించిన రూ.6630 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది.


మరోపక్క  ముంబాయిలోని చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు నాన్-బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీచేసింది. ఈ నేపథ్యంలోనే మాల్యా తనకు భారత్ రావాలని ఉందని ప్రకటన చేయడం.. దీనికి సంబంధించి కోర్టు ద్వారా లైన్ క్లియర్ చేయించుకునేందుకు ప్రయత్నించడం ఆసక్తిగా మారింది. మ‌రి దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: