మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌విస్ న‌లుగురు న‌డిచిన దారిలో తాను న‌డ‌వ‌రు. త‌న రూటే స‌ప‌రేటు అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. ఇప్పుడు అదే ఆయ‌న‌కు కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. ఓ నేర‌స్తున్ని ఇంటికి పిలిచి మ‌రీ వినాయ‌కునికి పూజ‌లు చేయించి కొత్త వివాదంలో ఇరుక్కున్నారు ఫ‌డ్న‌విస్‌.

ఫ‌డ్న‌విస్ అన్ని విష‌యాల్లోనూ చురుకుగా వ్య‌వ‌హ‌రిస్తుంటార‌ని, అందుకే చిన్న వ‌య‌సులోనే సీఎం అయ్యార‌ని ఆయ‌న స‌న్నిహితులు, బీజేపీ నేత‌లు అంటుంటారు. కానీ అలాంటి వ్య‌క్తి ఈ మ‌ధ్య తీసుకుంటున్న నిర్ణ‌యాలు వివాదాస్ప‌ద‌మ‌వుతున్నాయి. సాధార‌ణంగానే అత్యున్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచితీసుకోవాలి. అస్సలు తొందరపడకూడదు. అయితే ఫ‌డ్న‌విస్ మాత్రం ఎందుకు చేశారో, ఎవ‌రి స‌ల‌హాతో చేశారో తెలియ‌దు కానీ ఓ నేర‌స్థున్ని త‌న ఇంటికి పిలిచారు.


మహారాష్ట్రలోని సింధు దుర్గ్ జిల్లా మహదేవ్ వాడి గ్రామానికి చెందిన హెవలేకర్ దంపతులు గత బుధవారం వినాయకుడి విగ్రహంతో మ‌హారాష్ట్ర‌ సచివాలయం గేటు వద్ద ఆందోళనకు దిగారు. తనను తన గ్రామంలో సాంఘికంగా వెలి వేశారని.. గణేశ్ ఉత్సవాల్లో పాల్గొనకుండా అడ్డుకుంటున్నారని చెప్పి హడావుడి చేశారు. దీంతో స్పందించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్రఫడ్నవిస్.. ఆ దంపతుల్ని వినాయకచవితి రోజు తన నివాసానికి ఆ దంపతుల్నిఆహ్వానించారు. తమతో కలిసి ఆ దంప‌తుల‌ను కూడా గణేశ్ పూజల్లో పాల్గొనేలా చేశారు.


దీనికి సంబంధించిన ఫోటోలు మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా..  మంచి కోసం ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వివాదంగా మారింది. సీఎం చేర‌దీసిన స‌ద‌రు వ్య‌క్తి హిస్టరీ చూస్తే.. 2013లో ఒక మహిళపై లైంగికంగా వేధించిన కేసు నమోదు అయి ఉంది. 2014లో స్థానిక కోర్టులో ఆయనపై పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు హాజరు కాకపోవటంతో ఇతనిపై కోర్టు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసి కూడా ఉంది.


ఇలాంటి ఘన చరిత్ర ఉన్న వ్యక్తిని ముఖ్యమంత్రి తన ఇంటికి గణేశ్ పూజకు స్వయంగా పిలవటమే కాదు.. తన పక్కనే కూర్చోబెట్టుకుని పూజ చేయించటం ఇప్పుడు వివాదంగా మారింది. తాజాగా ఇతడి హిస్టరీ బయటకు రావటంతో అరెస్ట్ చేసిన పోలీసులు.. అనంతరం బెయిల్ మీద విడుదల చేశారు. అత‌డి చరిత్ర తెలుసుకున్న పోలీసులు ఇప్పుడు నాలుక క‌ర్చుకుంటున్నారు. అటు సీఎం కానీ, ఇటు ఇత‌ర అధికారులు కానీ  ఇంటికి పూజకు ఆహ్వానించే క్రమంలో అతడి ముందు వెనుకా ఆరా తీయకుండా పిలిచేయటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి దగ్గరకు ఒకరిని పంపే ముందు.. అతడి చరిత్రపై నిఘా వర్గాలు ఎంతోకొంత దృష్టి పెట్టకుండా.. ఏకంగా సీఎం ఇంట్లో ఓ నేర‌స్తుడితో పూజ చేయించ‌డంపై ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: