భారత్ ప్రతిష్ఠ మరోసారి అంతర్జాతీయంగా మసకబారింది. భోఫోర్స్ కేసును తలపిస్తూ రక్షణ శాఖకు-ఇటలీకి మధ్య అవినీతి బంధం మరోసారి బయటపడింది. భారతదేశానికి పన్నెండు హెలికాప్టర్లను అమ్మిన ఒప్పందంలో ఇటలీ ప్రభుత్వ రంగ సంస్థ ఒకటి ముడుపుల కుంభకోణంలో చిక్కుకుంది. వీఐపీలు ప్రయాణించే విమానాల దిగుమతిలో కోట్లాది రూపాయలు చేతులు మారాయని ఇటలీ సర్కారు ఎయిరో స్పేస్ కంపెనీ ప్రధానాధికారిని అరెస్టు చేసింది. మూడు వేల ఆరువందల కోట్ల రూపాయలతో ఇటలీ నుంచి 9 ఆగస్టా హెలికాప్టర్లను దిగుమతి చేసుకునేందుకు జరిగిన ఒప్పందంలో అనేక అవతకవలు జరిగినట్లు సమాచారం రాష్ట్రపతి, ప్రధాని వంటి అత్యంత ప్రముఖులైన వ్యక్తులు ప్రయాణించే హెలికాప్టర్ల కొనుగోలు ఆర్డర్ల కోసం.. భారత్‌లో సుమారు రూ.362 కోట్ల ముడుపులు చెల్లించారనే అనుమానంపై ఇటలీ ప్రభుత్వ ఏరోస్సేస్ ఫిన్మెక్కానికా కంపెనీ ప్రధానాధికారిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. ఫిన్మెక్కానికా అనుబంధ సంస్థ అగస్టా వెస్ట్‌ల్యాండ్ ఉత్పత్తి చేసిన 12 హెలికాప్టర్లను భారత్‌కు విక్రయించే ఆర్డర్‌ను కైవసం చేసుకునేందుకు.. ఓర్సీ ఇండియాలో ముడుపులు చెల్లించినట్లు ఇటలీ పోలీసులు అనుమానిస్తున్నారు. ఒప్పందం విలువలో సుమారు 10% అంటే 5 కోట్ల యూరోలు...భారత కరెన్సీలో 362 కోట్లు ముడుపులుగా చెల్లించారని విచారణాధికారులు అనుమానిస్తున్నారు. ముడుపుల ఆరోపణలపై సమగ్ర సమాచారం ఇవ్వాల్సిందిగా రోమ్‌లోని భారత రాయబార కార్యాలయం ఇటలీ ప్రభుత్వాన్ని కోరింది. అయితే ప్రస్తుతం న్యాయప్రక్రియ కొనసాగుతున్నందున ఈ విషయమై తామెలాంటి సమాచారాన్నీ పంచుకోలేమని ఇటలీ తెలిపింది. అటు ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశిస్తున్నట్లు రక్షణ మంత్రి ఎ.కే. ఆంటోనీ తెలిపారు. నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు. భారత వైమానిక దళం (ఐఏఎఫ్) కోసం మూడు ఇంజన్లు కలిగిన 12 ఏడబ్ల్యూ-101 హెలికాప్టర్లను కొనుగోలు చేయాలని భావించిన భారత ప్రభుత్వం 2010 ఫిబ్రవరిలో ఇటలీ కంపెనీతో ఒప్పందంపై సంతకాలు చేసింది. సుమారు రూ.3,600 కోట్ల విలువైన ఈ ఒప్పందం మేరకు ఇప్పటికే 3 హెలికాప్టర్లు దేశానికి చేరుకోగా.. మిగిలిన 9 హెలికాప్టర్లను తీసుకోకుండా నిలిపివేయాలని రక్షణ శాఖ నిర్ణయించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం తక్షణమే ఈ అవకతవకలపై వివరణ ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేసింది. హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో చోటుచేసుకున్న ఆర్థిక అవకతవకలను గత ఏడాదిగా తాము ప్రస్తావిస్తూనే ఉన్నామని బీజేపీ పేర్కొంది. ఈ స్కాంకు సంబంధించి ఇటలీలో సంబంధిత కంపెనీ సీఈవోను అరెస్టు చేసినా.. ఇక్కడ ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం దురదృష్టకరమని ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. జవదేవకర్ ఈ విషయాన్ని అప్పట్లో రాజ్యసభలో ప్రస్తావించడమే కాకుండా.. ఆ తర్వాత ఆంటోనీకి లేఖ కూడా రాశారు. ఇప్పటికే రక్షణ సామాగ్రి కొనుగోళ్లకు సంబంధించిన భోఫోర్స్ స్కాంలో అప్రతిష్ట పాలైన కాంగ్రెస్ సర్కార్... లేటెస్ట్ గా ఆగస్టా హెలికాప్టర్ల కుంభకోణం భారీ మూల్యాన్ని చెల్లించక తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: