ఇప్పుడు ఏపీ ప్రాంతంలో మ‌రోసారి స్వీస్ చాలెంజ్ తెర‌పైకి వ‌చ్చింది. రాజ‌ధాని నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన ఈ స్వీస్ చాలెంజ్ ఇప్పుడు భారీ కుంభ‌కోణానికి తెర‌తీశార‌నే చెప్పాలి. దాదాపుగా  రూ. ల‌క్ష కోట్ల‌కు ఎస‌రు పెట్టార‌ని తెలుస్తోంది! తాజాగా ఇదే విషయాన్ని హైకోర్టు ధ‌ర్మాస‌నం కుండ బ‌ద్ద‌లు కొట్టింది. ఏపీఐడీఏ-2001 చ‌ట్టాన్ని తుంగ‌లో తొక్కారు. విజ‌య్ కేల్క‌ర్ క‌మిటీ నివేదిక‌ను బేఖాత‌రు చేశారు. సింగ‌పూర్ ప్రైటేటు సంస్థ‌ల‌తో క‌లిసి రాజ‌ధాని స్టార్ట‌ప్ ఏరియా ప్రాజెక్టు లో రూ. ల‌క్ష కోట్లు కొల్ల‌గొట్టేందుకు స్విస్ చాలెంజ్ పేరుతో చంద్ర‌బాబు స‌ర్కార్ భారీ కుంభ‌కోణానికి తెర‌తీశారు! రాజ‌ధాని ఏర్పాటు ప్ర‌క‌ట‌న అదికారికంగా వెలువ‌డ‌క ముందే పులువురికి  లీకులు ఇచ్చి ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్ కు పాల్ప‌డి నిరుపేద రైతుల  క‌డుపుకొట్టి భూములు కొట్టేసి రూ. ల‌క్ష కోట్లు  దోచుకుంది చంద్ర‌బాబు అండ్ కో.

స్విస్ చాలెంజ్ పేరు తో మాస్ట‌ర్ ప్లాన్...


అంతేకాకుండా... రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులోనూ అదే తరహా దోపిడికి బరితెగించింది. భూసమీకరణ ముసుగులో రైతుల నుంచి బలవంతంగా లాక్కున్న భూములను స్విస్ ఛాలెంజ్ విధానంలో సింగపూర్ సంస్థల కన్సార్టియంకు ధారాదత్తం చేసి.. రియల్ ఎస్టేట్ దందా చేసి రూ.లక్ష కోట్లు కొట్టేసేందుకు ‘మాస్టర్ ప్లాన్’ వేశారు. అందుకోసం స్విస్ చాలెంజ్ విధానం నిబంధనలనూ అడ్డగోలుగా ఉల్లంఘించి, ‘అధికారిక రహస్యాల ప్రమాణాన్ని తుంగలో తొక్కి కేంద్ర ప్రభుత్వాన్ని నిలువునా మోసం చేశారు. స్విస్ చాలెంజ్ విధానంలో పారదర్శకత వీసమెత్తు కూడా లేదని సుప్రీం కోర్టు స్పష్టీకరించినా.. ఎలాంటి పరిస్థితుల్లోనూ స్విస్ చాలెంజ్ విధానాన్ని ప్రోత్సహించవద్దంటూ కేల్కర్ కమిటీ తెగేసి చెప్పినా.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్, అప్పటి ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్‌లు వారించినా వెనక్కు తగ్గలేదు.

చంద్ర‌బాబు సింగ‌పూర్ తో ర‌హ‌స్య ఒప్పందం...


ప్రధాన రాజధాని కేంద్రం(సీడ్ కేపిటల్)లో అత్యంత విలువైన 1,691 ఎకరాల్లో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును చేపట్టేందుకు స్విస్ చాలెంజ్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసేశారు. హైకోర్టు ధర్మాసనం సోమవారం చేసిన వ్యాఖ్యలు రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో నిబంధనల ఉల్లంఘనలను తేటతెల్లం చేశాయి. చంద్రబాబు అండ్ కో, సింగపూర్ సంస్థల కన్సార్టియం మధ్య కుదిరిన రహస్య ఒప్పందం గుట్టు రట్టయింది. చంద్ర‌బాబు సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన వెంట‌నే సింగపూర్ స‌ర్కార్ తో త‌నకు ఉన్న సంబంధాల వ‌ల్ల‌... రాజ‌ధాని  మాస్ట‌ర్ ప్లాన్ ను ఉచితంగా త‌యారు చేసి ఇవ్వ‌డానికి ఆ దేశం అంగీక‌రించింద‌ని ప్ర‌కటించారు. ఆ త‌రువాత 2014 లో న‌వంబ‌ర్ 12 నుంచి 14 వ‌ర‌కూ సీఎం చంద్ర‌బాబు సింగ‌పూర్ లో ప‌ర్య‌టించారు. మార్చి 30, 2015 న రాజ‌ధాని ప్రాంత మాస్ట‌ర్ ప్లాన్ ను సింగ‌పూర్ సంస్థ‌లు అందించిన స‌మ‌యంలోనే మాస్ట‌ర్ డెవ‌ల‌ప‌ర్ ను స్వీస్ చాలెంజ్ విధానంలో ఎంపిక చేస్తామ‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు.

బీనామీల పేరుతో రంగంలోకి చంద్ర‌బాబు...

సింగపూర్ సంస్థ‌ల క‌న్సార్టియం కు స్టార్ట‌ప్ ఏరియా ప్రాజెక్టు క‌ట్ట‌బెట్టి... బినామీల‌తో క‌లిసి దొరికినంత దోచుకోవ‌డానికి సీఎం చంద్ర‌బాబు అడ్డ‌గోలుగా వ్య‌వ‌హ‌రించారు. స్టార్టప్ ఏరియా  ప్రాజెక్టు  అమ‌లుకు సింగ‌పూర్ సంస్థ‌ల కన్సార్టియం.. ప్ర‌భుత్వానికి చెందిన కేపిట‌ల్ సిటీ డెవ‌ల‌ప్ మెంట్ అండ్  మేనేజ్ మెంట్ కార్పొరేష‌న్ క‌లిపి అమ‌రావ‌తి డెవ‌ల‌ప్ మెంట్ పార్టన‌ర్ ని ఏర్పాటు చేస్తాయి. ఇందులో సీసీడీఎంసీఎల్ వాటా 50 శాతం, త‌మ వాటా 50 శాతం ఉండేలా అక్టోబ‌ర్ 30, 2015 న సింగపూర్ సంస్థ‌ల క‌న్సార్టియం తొలుత ప్ర‌తిపాదించింది. క‌న్సార్టియంగా ఏర్ప‌డిన సింగ‌పూర్ సంస్థ‌ల్లో త‌న బీనామీలు ఉండ‌టం తో చంద్ర‌బాబు రంగంలోకి దిగారు. ఈ ఏడాది జ‌న‌వరి 24,25 సింగ‌పూర్ సంస్థ‌ల‌తో  చర్చించిన చంద్ర‌బాబు ఏడీపీ లో ఆ సంస్థ‌ల వాటాను 58 శాతానికి పెంచాల‌ని, సీసీడీఎంసీఎల్ వాటా 42 శాతానికి  త‌గ్గించాల‌ని స్వ‌యంగా సూచించారు. 

ల‌క్ష‌ల కోట్ల కుంభ కోణం...

ముఖ్య‌మంత్రి హోదాలో ప్ర‌భుత్వ వాటా ను పెంచ‌మ‌ని కోరాల్సిన చంద్ర‌బాబు త‌గ్గించ‌మ‌న‌డాన్ని బ‌ట్టి చూస్తే బినామీల‌తో క‌లిసి అడ్డ‌గోలు గా దోచుకోవ‌డానికి ఏ స్థాయిలో బ‌రి తెగించారో అర్థం చేసుకోవచ్చు. ఇంత‌కూ స్టార్ట‌ప్ ఏరియా ప్రాజెక్టు అభివృద్దికి ఏడీపీ లో సింగ‌పూర్ సంస్థ‌లు పెట్టే పెట్టుబ‌డి ఎంతో తెలుసా?  కేవ‌లం రూ. 306.4 కోట్లు, రాష్ట్ర ప్ర‌భుత్వం సీసీడీఎంసీఎల్ త‌ర‌పున రూ. 221.9 కోట్లు పెట్టుబడి పెడుతుంది. ఇదిగాక‌... మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం  రూ. 5,500 కోట్లు ఖ‌ర్చు చేస్తుంది. అంటే... ఏడీపీ లో రూ. 306.4 కోట్లు పెట్టుబ‌డి పెట్టే సింగ‌పూర్ క‌న్సార్టియం వాటా  58 శాతం... రూ. 5,721.9 కోట్లు  పెట్టుబ‌డి పెట్టే సీసీడీఎంఎల్ వాటా 42 శాత‌మే. ఇక్క‌డే సింగ‌పూర్ కంపెనీల్లో బినామీ ల దోపిడీ కి బీజం ప‌డింది. రైతుల  నుంచి బ‌ల‌వంతంగా లాక్కున్న భూమిలో 1691 ఎక‌రాలు స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును చేప‌ట్టారు.

విజయవాడ బందరు రోడ్డులో గజం భూమి విలువ రూ.రెండు లక్షలకుపైగానే పలుకుతోంది. రాజధానిలో అత్యంత కీలకమైన సీడ్ కేపిటల్‌లో గజం విలువ హీనపక్షం రూ.లక్ష పలుకుతుందని స్వయంగా సీఎం చంద్రబాబే చెబుతున్నారు. ఈ లెక్కన ఎకరా భూమిలో రహదారులు, పార్కులకు కొంత పోయి.. మిగిలే 2,800 గజాల స్థలం విలువ రూ.28 కోట్లు పలుకుతుంది.  అంటే.. 1691 ఎకరాల విలువ రూ.47,348 కోట్లు. ఇందులో సింగపూర్ కన్సార్టియం వాటా 58 శాతం. అంటే.. ఆ సంస్థలకు రూ.27,461.84 కోట్లు దక్కుతాయి. రాష్ట్ర ప్రభుత్వానిది 42 శాతమే కాబట్టి దక్కే సొమ్ము రూ.19,886.16 కోట్లే. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి 20 ఏళ్లపాటూ ఎవరూ అడ్డు రాకుండా చూసేందుకు.. కేపిటల్ సిటీ పరిధిలో 20 ఏళ్లపాటూ రియల్ ఎస్టేట్ వెంచర్లకు అనుమతి ఇవ్వకూడదంటూ ఏకంగా నిబంధన పెట్టేశారు.

అంతే కాదు.. స్టార్టప్ ఏరియాలో భూమిని పాతికేళ్లలో ఎప్పుడైనా అమ్ముకునే వెసులుబాటు కల్పించారు. అంటే.. పదేళ్ల తర్వాత గజం 4 లక్షలు ఉంటే సింగపూర్ కంపెనీలకు వచ్చే లాభం రూ.లక్ష కోట్లను దాటిపోతుంది. ఇదంతా చూస్తోంటే... మన భూమి ఇచ్చి, మన డబ్బుతో మౌలిక సదుపాయాలు సమకూర్చి... సింగపూర్ కంపెనీలకు అత్యధికం గా లాభాలిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇలా సింగపూర్ కంపెనీల కోసం, స్వప్రయోజనాలకోసం చంద్రబాబునాయుడు సర్కారు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టేసింద‌న‌టంలో స‌దేహం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: