తాజాగా మ‌రోసారి సెప్టెంబ‌ర్ 17 తెర‌పైకి వచ్చింది. గ‌త 17 వ తేదీన బీజేపీ  తిరంగయాత్ర‌లో భాగంగా వ‌రంగ‌ల్ వేదిక గా ఆ పార్టీ అధ్య‌క్షుడు అమిత్ షా అధికార టీఆర్ఎస్ పై భారీ విమ‌ర్శ‌లే  చేశారు. దేశం మొత్తం విలీన దినంగా ప్ర‌క‌టిస్తే... తెలంగాణ రాష్ట్ర మాత్రం ఎందుకు విలీన దినంగా జ‌రుప‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. కేసీఆర్ నిజాం పాల‌న కొన‌సాగిస్తు న్నార‌ని వ్యాఖ్యానించారు.  దీతో మ‌రోసారి  సెప్టెంబ‌ర్ 17 విద్రోహమా... విలీన‌మా అన్న  ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. తెలంగాణ చరిత్ర లో 1948 సెప్టెంబ‌ర్ 17 కు ప్రాధాన్య‌త ఉన్న‌ద‌న్న విష‌యంలో భిన్నాభిప్రాయం ఉంది. అయితే ఇటీవ‌ల కాలంలో సెప్టెంబ‌ర్ 17న తెలంగాణ విమోచ‌నా దినంగా  పాటించాల‌ని ప్ర‌భుత్వం అధికారికంగా  విమోచన దినాన్ని నిర్వ‌హించాల‌ని  కేంద్ర బీజేపీ డిమాండ్ చేస్తోంది. 

సెప్టెంబ‌ర్ 17 పై భిన్నాభిప్రాయాలు

మ‌రాఠ్వాడాలో... హైద‌రాబాద్ క‌ర్ణాట‌క జిల్లాల్లో ఆయా ప్ర‌భుత్వాలు విమోచ‌న దినోత్స‌వాని అధికారికంగా ఉత్స‌వాలు నిర్వ‌హిస్తున్న‌ప్పుటికీ... తెలంగాణ లో కూడా విమోచ‌న ఉత్సవాలు ఎందుకు జ‌రుకూడ‌ద‌న్న వాద‌న‌ను ముందుకు తెస్తున్నాయి. మ‌రాఠ్వాడాలో...  మరాఠ్వాడాలో, హైదరాబాద్ కర్ణాటక జిల్లా ల్లో ప్రజల అనుభవాలకు, ఇక్కడ తెలంగాణలో ప్రజ ల అనుభవాలకు తేడా ఉన్నది. సెప్టెంబర్17 అనంతరం తెలంగాణలో చోటు చేసుకున్న విద్రోహ రాజకీయ పరిణామాలను విశ్లేషణ చెయ్యకుండా ఇతరేతర ప్రయోజనాల కోసం చేస్తున్న డిమాండ్‌గానే చూడవలసి ఉంటుంది. నిజానికి సెప్టెంబ‌ర్ 17 ను ఎలా చూడాలి అన్న అంశం పై తెలంగాణ స‌మాజంలో భిన్నాభిప్రాయాలు ఉద్య‌మ‌కాలం నుంచే  ఉన్నాయి, తెలంగాణ హిస్ట‌రీ సొసైటీ ఈ భిన్న‌దృక్కోణాలను క్రోడీక‌రిస్తూ 2009 లో ఒక పుస్త‌కాన్ని  కూడా వెలువ‌రించింది.

విమోచ‌న, విముక్తి గా సెప్టెంబ‌ర్ 17 చూడ‌లేం

సెప్టెంబ‌ర్ 17 న విలీనం, విమోచ‌నం. ఆక్ర‌మ‌ణ‌., విముక్తి వంటి ప‌దాల‌తో విర్ణిస్తున్నారు. ఏది ఏమైనా ఆ రోజున అప్ప‌టి వ‌ర‌కు స్వ‌తంత్ర సంస్థానంగా ఉన్న హైద‌రాబాద్ రాజ్యం  భార‌త యూనియ‌న్ లో విలీనం అయింద‌నేది ఎవ‌రూ కాద‌న‌లేని స‌త్యం. విమోచ‌న‌, విముక్తి అనేటువంటి వ్య‌క్తీక‌ర‌ణ‌లు సెప్టెంబ‌ర్ 17 కు ఆపాదించ‌డం స‌రైంది కాద‌నేది తెలంగాణ చ‌రిత్ర‌కారులు, మేదావుల అభిప్రాయం. వాస్త‌వానికి స‌మ‌కాలీన చ‌రిత్ర‌కారులు, వ్యాఖ్యాత‌లు , భార‌త ప్ర‌భుత్వం, సైన్యం ఎవ‌రూ కూడా ఆ సంఘ‌ట‌న‌ను విమోచ‌న‌గా... విముక్తి గా పేర్కొన‌లేదు. 1961 వ‌ర‌కు పోర్చుగీసు పాల‌న‌లో ఉన్న గోవాను భార‌త యూనియ‌న్ లో విలీనం చేసే చ‌ర్య‌ను భార‌త ప్ర‌భుత్వం గోవా విముక్తిగానే పేర్కొన్నారు. 1972లో బంగ్లాదేశ్‌ను పాకిస్థాన్ చెర నుంచి విడిపించడానికి చేసిన సైనిక చర్యను భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ విముక్తిగానే పేర్కొన్నది. 

పండిత్ సుంద‌ర్ లాల్ క‌మిటి నివేదిక‌

కానీ 1948 సెప్టెంబర్ 13న ప్రారంభమైన ఆపరేషన్ పోలో ( ఆప‌రేష‌న్ పిల్ల‌ర్)  పేరిట సాగిన సైనిక చర్యను భారత ప్రభుత్వం పోలీస్ చర్యగా పేర్కొన్నది తప్ప ఎక్క డా విమోచన, విముక్తి అన్న పదాలను వాడలేదు. పోలీస్ యాక్షన్ గా పిలువబడిన సైనిక చర్య లక్ష్యం హైదరాబాద్ రాజ్యంలో బలపడుతున్న కమ్యూనిస్టులను అణిచివెయ్యడమే అయ్యింది తప్ప ఆనాడు హైదరాబాద్ రాజ్య ప్రజలు అనుభవిస్తున్నభూస్వా మ్య దోపిడీ నుంచి విముక్తి మాత్రం లభించలేదు. సారాంశంలో 1948 సెప్టెంబర్17 అనంతరం జరిగినదేమిటి అనేది ఈసందర్భంగా విశ్లేషించుకోవాలి. ఇదే క్ర‌మంలో నాటి పండిత్ సుంద‌ర్ లాల్ నిజ‌నిర్ధార‌ణ క‌మిటి ( నాటి స‌ర్థార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ ఈ నివేదిక ను గోప్యంగా ఉంచింది)  కూడా ఓ నివేదిక‌ను ఇచ్చింది. 

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం...

సుంద‌ర్ లాల్ కమిష‌న్ లో సారాంశం ఏమిటంటే... అప్పటి వరకు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల కేం ద్రీకృత ఆధిపత్యానికి లోబడి స్వతంత్రంగా కొనసాగుతున్న హైదరాబాద్ రాజ్యం భారత యూనియన్ లో విలీనమయ్యింది.  వెంటనే కాకున్నప్పటికీ రాచరిక పాలన అంతమై ప్రజాస్వామ్య పాలనకు మార్గం సుగమమైంది. అంతేకాకుండా... తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వల్ల మూడు వేల గ్రామాల్లో భూస్వాముల ఆధీనంలోని 10 లక్షల ఎకరాల భూమి విముక్తం అయి రైతుకూలీల పరమయ్యింది. సైనిక చర్య అనంతరం ఈ భూమి తిరిగి భూస్వాముల పరమైనాయి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సాధించిన విముక్తి ఫలాలను సైనిక చర్య తిరగదోడింది. సైనిక చర్యలో రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించిన కమ్యూనిస్టులను, పోరాటంలో పాల్గొన్న వేలాది మంది రైతుకూలీలు సైన్యం ఊచకోతకు గురైనారు. 

రాజాకార్ల పేరుమీద సెన్యం ఊచ‌కోత‌

హైదరాబాద్ రాజ్యంలో, ముఖ్యంగా మరాఠ్వాడాలో వేలాది మంది ముస్లిం ప్రజానీకం రజాకార్ల పేరుమీద సైన్యం ఊచకోతకు బలైనారు. సైనిక చర్య అనంతరం 1948 నుంచి 1952 దాకా హైదరాబాద్ స్టేట్‌లో సైనిక పాలన కొనసాగింది. భారత ప్రభుత్వం వెల్లోడి అనే సివిల్ అధికారిని ప్రధానమంత్రి హోదాలో హైదరాబాద్ కు పంపింది. 1952లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగాయి.హైదరాబాద్ స్టేట్ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగాయి. బూర్గుల నరసింగరావు ముఖ్యమంత్రిగా ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. 1956 లో రాష్ట్రాల‌ పునర్ వ్యవస్థీకరణ జరిగి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుతో తెలంగాణ తిరిగి పరాధీనమయ్యింది.

సుంద‌ర్ లాల్ క‌మిటి నివేదికను బ‌హిర్గతం చేయండీ: క‌విత‌

దీనిని బ‌ట్టి చూస్తే తెలంగాణ విమోచ‌నం ఎలా అవుతుంద‌ని నేటి టీ స‌ర్కార్ వాద‌న‌. అంతేకాదు నాటి సుంద‌ర్ లాల్ క‌మిటీ నివేదిక ను బ‌య‌ట‌పెట్టి సెప్టెంబ‌ర్ 17 పై స్పందించాల‌ని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఇదే విష‌యాన్ని నిజామాబాద్ ఎంపీ క‌విత అమిషాను ప్ర‌శ్నించారు. వాస్త‌వానికి సుంద‌ర్ లాల్ క‌మిటి నివేదిక‌ను నాటి ఉప ప్ర‌ధాని గా ఉన్న‌ స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ గోప్యంగా ఉంచార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.  మొత్తంమీద ఇప్ప‌టికి సెప్టెంబ‌ర్ 17 పై అన్ని పార్టీలు స్ప‌ష్ట‌మైన వైఖ‌రిని మాత్రం చూప‌డం లేదు. ఎన్నిరోజుల‌కు ఈ వివాదానికి తెర‌ప‌డునుందో చూడాలి మ‌రి....!

మరింత సమాచారం తెలుసుకోండి: