జగన్ మోసం చేశాడు, నాకు ఎమ్మెల్సీ ఇస్తానంటే వద్దన్నా, కొత్త నేతలపై వైసీపీ నాయకులు ఆధారపడుతున్నారు. దీంతో ఆ పార్టీకి దూరంగా ఉంటున్నా, ఒక వేళ సీఎం కిరణ్ పిలిస్తే కాంగ్రెస్‌లో చేరే విషయం ఆలోచిస్తానని మాజీ ఎమ్మెల్యే కలిచెర్ల ప్రభాకర రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం చిత్తూరు జిల్లాలోని బి.కొత్తకోటలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ వైసీపీ బలోపేతానికి తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఎంతో కష్టపడ్డానని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా తాను గెలిచే పరిస్థితులను సిద్ధం చేసుకున్నానన్నారు. అయితే ఆ పార్టీలో ఇటీవల కొత్త నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడంపై అభ్యంతరం తెలిపానన్నారు. ఇదే విషయమై జైలులో ఉన్న జగన్‌ను కలిస్తే తాను చెప్పిన వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరాడన్నారు. అలా చేస్తే తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని జగన్ చెప్పడంతో బాధకలిగిందని కలిచెర్ల ఆవేదన వ్యక్తం చేశారు. తాజా పరిణామాలతో తాను వైసీపీకి దూరం పాటిస్తున్నానన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులెవరూ తనను కలవలేదని, ఎంపీ సాయిప్రతాప్ మాత్రమే వ్యక్తిగతంగా కలిశారన్నారు. ప్రస్తుతం పీలేరు నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి జరుగుతోందని, అదే స్థాయిలో తంబళ్లపల్లె నియోజకవర్గ అభివృద్ధి విషయంలో గట్టి హామీ ఇచ్చి సీఎం కిరణ్ రమ్మని ఆహ్వానిస్తే కాంగ్రెస్ పార్టీలో చేరే విషయం ఆలోచిస్తానని కలిచెర్ల పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: