రష్యాలో అంతరిక్షం నుంచి భూ వాతావరణంలోకి ప్రవేశించిన ఓ భారీ ఉల్క ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ప్రభావంతో ముక్కలైన శిలలు చెల్యాబిన్స్ నగరానికి ముప్పు తెచ్చాయి. అత్యంత వేగంతో భూమిని తాకడం వల్ల ఏర్పడిన ప్రకంపనలతో దాదాపు 3 వేల భవనాలు, అనేక కార్లు దెబ్బతిన్నాయి. సుమారు 950మంది గాయపడ్డారని అధికారిక వర్గాలు తెలిపాయి. . క్షతగాత్రుల్లో 159మంది చిన్నారులున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే సైన్యం రంగంలోకి దిగింది. దాదాపు 10 వేల మందితో కూడిన సహాయక బృందాలు నగరానికి చేరుకుని,ముందు జాగ్రత్తగా నగరంలో గ్యాస్ సరఫరాను నిలిపేశాయి.  బాధితులకు సాయం చేస్తూనే మరోపక్క గ్రహశకలాలు భూమిని తాకిన మూడు ప్రదేశాలను గుర్తించాయి. రెండు శిలలు ఇక్కడి చెబార్కుల్ చెరువు సమీపంలో పడిన ఆనవాళ్లు కనిపించాయి. ఇతర ప్రాంతాలను పరిశీలించడానికి మూడు యుద్ధ విమానాలనూ రంగంలోకి దించారు. ఉల్కాపాతం వల్ల రేడియేషన్ ప్రభావం, రసాయనిక చర్యల ముప్పును పరిశీలించడానికి ప్రత్యేక రక్షణ బృందాలను ఇక్కడకి తరలించారు. ఇక ఈ ఉల్కాపాతానికి సంబంధించిన వీడియోలను స్థానికులు కొందరు ఇంటర్‌నెట్‌లో పోస్ట్ చేశారు. ప్రపంచ వినాశనం జరుగనుందేమో అంటూ కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: