వందల కోట్ల రూపాయలు డిపాజిట్లుగా సేకరించి శఠగోపం పెట్టిన కంపెనీల జాబితాలో మరో సంస్థ చేరింది. విశాఖలో అధిక వడ్డీ ఆశ చూపి ప్రజల వద్ద నుంచి కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించి సిమ్స్ అనే సంస్థ బోర్డు తిప్పేసింది. ఈ కంపెనీ గత మూడు నెలలుగా ఖాతాదారులకు వడ్డీ చెల్లించడంలేదు. నిలదీస్తున్న వారికి ఎప్పటికప్పుడు సర్దిచెబుతూ జాప్యం చేసింది. డిపాజిటర్ల నుంచి ఒత్తిడి పెరగడంతో అందరికీ 15వ తేదీన సొమ్ము చెల్లిస్తామని, ఆందోళన చెందవద్దని వివరణ ఇచ్చి పంపింది. దీంతో శుక్రవారం డిపాజిటర్లు ఎక్కడికక్కడ స్థానిక కార్యాలయాలకు వెళ్లారు. అయితే అక్కడ డబ్బులు ఇచ్చే పరిస్థితి ఏమీ లేకపోవడంతో ఆందోళనకు దిగారు. కొన్నిచోట్ల ఫర్నీచర్ ధ్వంసం చేయగా, మరికొన్నిచోట్ల దొరికింది దొరికినట్టు తీసుకెళ్లిపోయారు. ఈ సంస్థ ప్రజల నుంచి 500 కోట్ల రూపాయలకుపైగా వసూలు చేసినట్లు సమాచారం. లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే నెలకు పది వేల రూపాయలు వడ్డీ ఇస్తామని ఆశ చూపింది. కొన్ని నెలలపాటు ఆ విధంగా వడ్డీ చెల్లించడంతో మధ్య తరగతి ప్రజలు ఎగబడి తమ వద్ద ఉన్న సొమ్ముని ఈ సంస్థలో దాచుకున్నారు. అయితే డబ్బులు ఇవ్వకపోవడంతో అనకాపల్లి, యలమంచిలిలలోని సంస్థ కార్యాలయాలపై డిపాజిట్ దారులు దాడి చేశారు. ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. డిపాజిట్ చేసివారి నుంచి ఒత్తడి పెరగడంతో అనకాపల్లిలో సిమ్స్ సంస్థ ఏజెంట్ సత్తిబాబు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. చోడవరంలో సిమ్స్ కార్యాలయం వద్ద డిపాజిట్ దారులు ఆందోళనకు దిగారు. ఇదిలా ఉండగా, సంస్థ యజమాని సురేంద్ర గుప్త పోలీస్ ఉన్నతాధికారుల వద్ద లొంగిపోతారని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: