తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనతంగా కురుస్తున్న వర్షాలతో ఉభయ తెలుగు రాష్ట్రాలు తడసి ముద్దవుతున్నాయి.  మరో రెండు, మూడు రోజుల వరకూ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఏపీలోనూ వర్షాలు కురుస్తున్నప్పటికి తెలంగాణలో వర్షాలు అపార నష్టాన్ని, తీరని కష్టాలను మిగిల్చాయి. 


హైదరాబాద్‌ చరిత్రలో రెండోసారి అతిపెద్ద వర్షాలు కురవడంతో భాగ్యనగరం ప్రజల బతకులు చిధ్రమైపోయాయి. భారీ వర్షాలకు కాలనీలు జలమయం అయ్యాయి. రోడ్లు నదులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులుగా మారిపోయాయి. నగర జీవి అడుగుతీసి అడుగువేయడానికి కూడా నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇంకా కొన్ని కాలనీలు వరద నీటిలోనే ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.


తెలంగాణలో మాదిరి కాకున్నా..అటు ఏపీలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గుంటూరు.. కృష్ణాతో పాటు మరికొన్ని జిల్లాల్లోనూ ప్రజలు తీవ్ర అవస్థలకు గురి అవుతున్నారు. అయితే వర్షాలపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భిన్నంగా స్పందించారు. అన్ని విషయాల్లోనూ పోటీ పడే వీరు వర్షాల వల్ల నష్టపోయిన ప్రజలను పరామర్శించడంలో మాత్రం భిన్న దోరణిని అవలంభించారు. 


భారీ వర్షాలు  పడుతున్నాయని తెలిసిన వెంటనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో తక్షణ చర్యలపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి సలహాలు, సూచనలు చేస్తూ అధికారులను అప్రమత్తంగా ఉంచడంతో పాటు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంపై దృష్టిపెట్టారు. అదే తరుణంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ మాత్రం వీటిపై పెద్దగా స్పందించలేదు. తనతో పాటే ఉన్న సీఎస్‌ రాజీవ్‌ శర్మను వివరాలు అడిగి తెలుసుకోవడం, మంత్రులకు ఆదేశాలు జారీ చేసి తనపాని తాను చేసుకుపోయారు.


ఓపక్క హైదరాబాద్ మహానగరంలో భారీ ఎత్తున ప్రజలు వరద నీటితో ఇక్కట్లకు గురి అవుతున్నా.. కేసీఆర్ కుమారుడు మంత్రి కేటీఆర్ పలు ప్రాంతాల్లో పర్యటించి.. బాధితులకు ధైర్యాన్ని కలిగించి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. కానీ.. అందుకు భిన్నంగా కేసీఆర్ మాత్రం అంతగా స్పందించలేదు. బయటకు ఢిల్లీ పర్యటన అనంతరం కూడా బాధిత ప్రాంతాల్లో ఆయన పర్యటించలేదు. అధికారులతో రివ్యూ నిర్వహించి.. మీడియా సమావేశంలో వరద నీరు పోటెత్తటానికి కారణం అక్రమ నిర్మాణాలే అంటూ తీవ్రంగా ఫైర్ అయి.. నాలాల మీద కట్టిన అక్రమ కట్టడాల్ని యుద్ధప్రాతిపదికన తీసేస్తామని అల్టిమేటం జారీ చేశారు.


మీడియా మేనేజ్‌మెంట్‌ తెలిసిన  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి వెళ్లేందుకు, పరామార్శలకు ప్రాధాన్యత ఇస్తే.. కేసీఆర్‌ మాత్రం కూర్చున్న చోటు నుంచే అల్టీమేటం జారీ చేసి తన మార్క్‌ పాలనను చూపించాడు. అయితే ఒకేలాంటి ఇష్యూను ఇద్దరు చంద్రుళ్లు డీల్ చేసిన తీరుపట్ల ప్రజలు తలోమాట మాట్లాడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: