స్పెష‌ల్ స్టోరీ: అంత‌ర్జాతీయ న‌గ‌రంలో ఆప‌రేష‌న్ నాలా షురూ....!
త‌న‌దాక వస్తే గాని తెలియ‌దు, స‌మ‌స్య త్రీవ‌త ఏంటో... ! సాక్షాత్తు ఇదే జ‌రిగింది తెలంగాణ స‌ర్కార్ కు. గ‌త రెండు వారాలుగా బంగాళ ఖాతం అల్ప‌పీడ దోర‌ణి తో తెలంగాణలో విస్తార‌మైన వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఈ క్ర‌మంలో గ్రేట‌ర్ హైద‌రాబాద్ లో కురుస్తున్న వ‌ర్షాల‌కు న‌లాలు ఉప్పొంగాయి. ఎటు చూసిన నీరే. చెరువుల‌ను, కుంట‌లు త‌ల‌పిస్తున్నాయి న‌గ‌ర రోడ్లు. ఇక లోత‌ట్టు ప్రాంతాల‌న్నీ జ‌ల‌మ‌యమ‌య్యాయి. న‌లాల, రోడ్ల పై నుంచి వ‌చ్చిన వ‌ర‌ద ఎక్క‌డ‌కు వెళ్లాలో తెలియ‌క  ఇండ్ల‌లోకి వ‌చ్చాయి. కూక‌ట్ ప‌ల్లి నిజాం పేట్  మొత్తం నీళ్ల‌తో నిండి పోయింది. అయితే దీనికంత‌టికి కార‌ణం ఏంటాన్ని ఆలోచించిన ప్ర‌భుత్వానికి అస‌లు విష‌యం బోద ప‌డింది. చెరువులు, న‌లాల క‌బ్జా గురికావ‌డంతోనే ఈ దుస్థితికి కార‌ణ‌మ‌ని భావించిన గులాబీ నేత‌, సీఎం కేసీఆర్ అక్ర‌మ నిర్మాణాల‌పై ఉక్కు పాదం మోపాల‌ని అధికారుల‌కు ఆదేశించారు.
అక్ర‌మాల‌పై కేసీఆర్ సీరియ‌స్...

విశ్వ‌నగ‌రంగా మార‌నున్న హైద‌రాబాద్ ప్ర‌స్థానంలో అక్ర‌మ నిర్మాణాలు బ‌ద్ద‌లు కావ‌ల్సిందేన‌ని కేసీఆర్ సంక‌ల్పించారు. అంత‌ర్జాతీయ కార్పొరేట్ ,ఐటీ సంస్థ‌ల  కేంద్రంగా మారుతున్న హైద‌రాబాద్ న‌గ‌ర ప్ర‌తిష్ట‌కు ఒక మ‌చ్చ‌లా త‌యారైన  అక్ర‌మ నిర్మాణాల కూల్చివేత‌ను ప్ర‌భుత్వం ప్రారంభించింది. కబ్జాకోరుల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ఎవరున్నా ఉపేక్షించేది లేదని, నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తామన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మాటలు 48 గంటల్లోపే వాస్తవరూపం దాల్చాయి. జీహెచ్‌ఎంసీ అధికారులు ఆగమేఘాలమీద కార్యాచరణ ప్రారంభించారు. చెరువులను, నాలాలను కబ్జా చేస్తూ నిర్మించిన వాటితోపాటు, అనుమతులు లేకుండా నిర్మించిన ఇండ్లను, అదనపు అంతస్తులను నేలమట్టం చేశారు. ప్రారంభించిన తొలిరోజే ఏకంగా 26 అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. 

మేజ‌ర్ నాల‌ల‌పై అక్ర‌మ నిర్మాణాలు కూల్చివేత‌

మేజర్ నాలాలపై సుమారు 28,000 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఒక్క‌సారి వాటి వివ‌రాలు గమనిస్తే... కాప్రాలోని చెరువు నాలా పై గ్యాస్ గోడౌన్, ఉప్ప‌ల్ లోని సౌత్ స్వ‌రూప్ న‌గ‌ర్ లో ఆక్ర‌మించిన నిర్మించిన ప్ర‌హ‌రీ గోడ‌, ఎల్బీన‌గ‌ర్ లోని దేవ‌క‌మ్మ తోట ప్రాంతంలో నాలాను ఆక్ర‌మించిన నిర్మాణం, వెంక‌టేశ్వ‌ర కాల‌నీ లో అక్ర‌మంగా నిర్మించిన నాలుగ‌వ అంత‌స్తు, రాజేంద్ర న‌గ‌ర్ లోని మైలార్ దేవ్ ప‌ల్లి లో ప‌ల్లె చెరువు నాలాపై రెండు అక్ర‌మ నిర్మాణాలు, లంగర్‌హౌస్‌లో నాలాను ఆక్రమించి కట్టిన ఇల్లు, నాంపల్లి అజంతా గేట్ వద్ద నాలా ఆక్రమణ, ఏసీ గార్డ్స్‌లో నిర్మించిన అక్రమ నిర్మాణం, యూసుఫ్‌గూడలో అక్రమంగా నిర్మించిన నాలుగవ అంతస్తు,  బంజారాహిల్స్‌లో నాలాను ఆక్రమించి బంజారా ఫంక్షన్ హాలు నిర్మాణం, శేరిలింగంపల్లిలో ఓ భవనంలో అక్రమంగా నిర్మించిన రెండు, మూడు అంతస్తులు, మదీనాగూడలోని రామకృష్ణానగర్ ఎన్‌ఎస్‌కే బ్లిస్ మిడోస్ వద్ద నాలాపై అక్రమ నిర్మాణం.

అక్ర‌మంగా నిర్మించిన క‌ట్ట‌డాలు ఇవే...

అంతేకాకుండా... ఆర్సీపురంలోని నాలా ఆక్రమించి నిర్మించిన గోడ, కూకట్‌పల్లిలోని ఖైత్లాపూర్‌లో ఓ భవనంలో అక్రమంగా నిర్మించిన అదనపు అంతస్తులు, కూకట్‌పల్లిలోని అంజయ్యనగర్‌లో 2 భవనాల్లో అక్రమంగా నిర్మించిన మూడవ అంతస్తులు, కూకట్‌పల్లిలోని ఆదిత్యనగర్‌లో అక్రమ నిర్మాణం, కూకట్‌పల్లిలోని ఆదిత్యనగర్‌లో అక్రమంగా నిర్మించిన గ్రౌండ్, ప్లస్ వన్ అంతస్తుగల భవనం, కూకట్‌పల్లిలోని ఆల్విన్ కాలనీలో అక్రమ నిర్మాణం, ఆల్విన్ కాలనీలో గ్రౌండ్ ప్లస్ 2 అంతస్తుల భవనం, కూకట్‌పల్లిలోని ఆల్విన్ కాలనీలో ఓ భవనంలో అక్రమంగా నిర్మించిన మూడవ అంతస్తు, కుత్బుల్లాపూర్‌లోని ఫాక్స్‌సాగర్ ఎఫ్‌టీఎల్‌లో అక్రమంగా నిర్మించిన 12 ప్రహరీ గోడలు, ఆల్వాల్‌లోని సిటిజన్ కాలనీలో ఓ భవనంలో అక్రమంగా నిర్మించిన నాలుగవ అంతస్తు , అల్వాల్‌లోని మంజీరా నగర్‌లో అక్రమంగా నిర్మించిన మూడవ అంతస్తు , మల్కాజ్‌గిరిలోని సాయినగర్ మెయిన్‌రోడ్‌లో అక్రమంగా నిర్మించిన పిల్లర్లు.

ఇలా వీట‌న్నింటినీ తొలంగించాల‌ని సంకల్పించారు.  వీటితోపాటు చెరువులను కబ్జాచేసి నిర్మించిన వాటిని, అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించిన, నిర్మిస్తున్న ఇండ్లను సైతం తొలగించాలని నిర్ణయించారు. మొత్తమ్మీద, కొన్ని దశాబ్దాలుగా చలనం లేకుండా పడి ఉన్న కూల్చివేతల ప్రక్రియలో కదలిక వచ్చింది. ఎంతోకాలంగా అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా జరుగుతున్నా, నాలాలు, చెరువులు కబ్జాలకు గురవుతున్నా అధికారులు వాటిని అదుపు చేయలేదు. న్యాయస్థానాలు ఆదేశించినా కూడా చర్యలు తీసుకోలేదు. అధికారుల, రాజకీయ నాయకుల అవినీతి తదితర కారణాలతో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండిపోయింది. దేనికైనా ఒక ముగింపు ఉంటుందన్నట్లుగా.. దశాబ్దాల ఈ నిర్లక్ష్యానికి ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఆదేశాలతో అంతం పడింది. అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై ఎక్కడా వ్యతిరేకత వ్యక్తంకాకపోవడం విశేషo.

మరింత సమాచారం తెలుసుకోండి: