ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మేఘాలయలో శనివారం జరిగిన ఎన్నికల్లో చెదురుమదురు ఘటనలు మినహా మొత్తంమీద ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ శాతం భారీగా నమోదైంది.నాగాలాండ్‌లో 83.29 శాతం పోలింగ్ రికార్డయింది. అలాగే మేఘాలయలో గా ఈసారి 88 శాతానికిపైగా పోలింగ్ నమోదైంది. ఈ రెండు రాష్ట్రాలతోపాటు త్రిపుర ఓట్ల లెక్కింపు ఈ నెల 28న జరగనుంది. నాగాలాండ్‌లోని 60 అసెంబ్లీ స్థానాలకుగాను 59 చోట్ల పోలింగ్ జరిగింది. సాయంత్రం పోలింగ్ ముగిసే 4 గంటల సమయానికి రాష్ట్రంలోని సుమారు 11 లక్షల మంది ఓటర్లలో 83.29 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు మేఘాలయలో పోలింగ్‌ను బహిష్కరిస్తూ నిషేధిత తీవ్రవాద సంస్థ హైన్నివ్‌ట్రెప్ నేషనల్ లిబరేషన్ కౌన్సిల్ పిలుపునిచ్చిన 36 గంటల బంద్‌ను ఏమాత్రం లెక్కచేయకుండా ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. సుమారు 15 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరో వైపు మిజోరాం, ఉత్తరప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్‌లలో జరిగిన ఉప ఎన్నికల్లోనూ పోలింగ్ ప్రశాంతంగా సాగింది. మిజోరాంలోని చాల్‌ఫిల్‌లో 78 శాతం, యూపీలోని భాట్‌పూర్‌లో 50 శాతం, పంజాబ్‌లోని మోగాలో 70.33 శాతం పోలింగ్ నమోదైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: