ఉత్కంఠంగా ఎదురు చూసిన రైల్వే బడ్జెట్ అయిపోయింది. ఇప్పుడు అందరి దృష్టీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ప్రవేశపెట్టే జనరల్‌ బడ్జెట్‌ పైనే ఉంది. 28న చిదంబరం బడ్జెట్ పార్లమెంట్ ముందుకు రాబోతోంది. అయితే త్వరలో వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనుండడం, వచ్చే ఏడాది సాధారణ ఎన్నికల నేపథ్యంలో చిద్దూ తన బడ్జెట్ వంటకాన్ని ఏమేరకు వండి వార్చుతారో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యూపీఏ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ కావడంతో ఈసారి కూడా కోతలు, వాతలకే ప్రాధాన్యమిస్తారా? లేక పేద, మద్యతరగతి వర్గాలను ఆకట్టుకునేలా బడ్జెట్ ఉంటుందా? అన్న ఉత్కంఠ నెలకొంది. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించిన కేంద్ర ప్రభుత్వం సంస్కరణలను మరింత వేగవంతం చేసే ఆలోచనలో ఉన్నట్టు స్పష్టమవుతోంది. దీనికి తగ్గుట్టుగానే అంతర్జాతీయ ధరటకు అనుగుణంగా పెట్రోల్ ధరలు పెంచడం, డీజిల్‌ పై ఇస్తున్న సబ్సిడీని క్రమంగా తగ్గించడం, ఎల్పీజీ సిలిండర్లలో కోత విధించింది. అయితే యూపీఏ ప్రభుత్వం ఇన్ని వాతలు పెడుతున్నా ఈ బడ్జెట్ లో ఆర్థిక మంత్రి చిదంబరం నుంచి సామాన్యలు, మధ్యతరగతి ప్రజలు చాలా ఆశిస్తున్నారు. ముఖ్యంగా ఇన్‌కంటాక్స్‌ పరిధిని లక్షా ఎనభై వేల నుంచి 3 లక్షలకు పెంచాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు. చిరదంబరం కూడా ఈ విషయాన్ని పరిశీలిస్తున్నారని మరీ అంత పెంచకపోయినా కనీసం 2 లక్షల వరకే పెంచొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ ఏడాది నుంచే డైరక్ట్‌ ట్యాక్స్‌ సిస్టమ్‌ కూడా అమల్లోకి వచ్చే ఛాన్సుంది.ప్రస్తుతం హౌసింగ్‌ లోన్‌పై లక్షా 50 వేల రూపాయల దాకా ట్యాక్స్‌ బెనిఫిట్‌ ఇస్తున్నారు. ఐతే ఇళ్ల ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ పరిమితి చాలదని ఉద్యోగులు అంటున్నారు. ఇక గ్యాస్‌ సిలిండర్లపై కోతను అందరూ నిరసిస్తున్నారు. ఏడాదికి కనీసం 12 సిలిండర్లను సబ్సిడీ కింద అందించాలంటున్నారు. కానీ కేంద్రం ఎల్పీజీపై వెనక్కి తగ్గకపోవచ్చని తెలుస్తోంది. వైద్య రంగానికి పెద్ద ఎత్తున నిధులు ఇస్తారని, గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఇతర శాఖలతో అనుసంధానించి మరింత మందికి ఉపాధి కల్పించే ఆలోచన కూడా ఉన్నట్టు తెలుస్తోంది. రైతు రుణాలను మరింత సరళీకరించొచ్చని తెలుస్తోంది. ఇక కేంద్రం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నగదు బదిలీ పథకం విజయవంతం చేసేందుకు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవచ్చని అంటున్నారు. టెలికాం రంగాన్ని మరింత విస్తృత పర్చే దిశగా చర్యలు తీసుకుంటారని వాణిజ్య వర్గాలు భావిస్తున్నాయి. మరి సామాన్య, మధ్యతరగతి ప్రజల అభిప్రాయలకు అనుగుణంగా చిదంబరం బడ్జెట్ ఉటుందా? లేక సంస్కరణలను అమలు చేయడమే లక్ష్యంగా కార్పొరేట్ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తారా అన్నది తెలియాలంటే మరో రోజు ఆగాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: