సామాన్యులకు కష్టాలు తక్కువ ఉన్నట్లు ఇప్పుడు వారి మీద మరో గుది బండ పడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా భూములు, ఇళ్ల స్థలాలు, కట్టడాల మార్కెట్ రిజిస్ట్రేషన్ విలువలు మరింత పెరగనున్నాయి. ఈ పెంపు సగటున 30 నుంచి 50 శాతం వరకూ ఉండబోతోంది.  కొన్ని నగరాల పరిధిలోని గ్రామాల్లో 200 నుంచి 300 శాతం వరకూ పెరిగాయి. సవరించిన మార్కెట్ విలువలు మార్చి 15వ తేదీ వరకు సబ్ రిజిస్ట్రార్, తహసీల్దారు కార్యాలయాల్లో ప్రదర్శనకు ఉంటాయి. అలాగే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్‌లోనూ పెట్టారు. అయితే కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోని భూములు, కట్టడాల విలువలు ఇంకా వెబ్‌సైట్‌లో పెట్టలేదు. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మార్కెట్ రివిజన్ కమిటీ బుధవారం సమావేశమై కొత్త రిజిస్ట్రేషన్ విలువలకు ఆమోదం తెలిపింది. కొత్త రిజిస్ట్రేషన్ విలువలపై ప్రజలకు ఎవరికైనా అభ్యంతరాలున్నా, సలహాలు ఇవ్వదలచుకున్నా వచ్చే నెల 15వ తేదీలోగా నేరుగా సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో లిఖిత పూర్వకంగా అందజేయవచ్చు. వీటిని మార్చి 16 నుంచి 20వ తేదీ వరకూ మార్కెట్ సవరణ కమిటీలు పరిశీలిస్తాయి. సవరించిన ధరలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. ఈ ధరలపైనే భూముల రిజిస్ట్రేషన్ సమయంలో పట్టణ ప్రాంతాల్లో 7.5 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 8.5 శాతం స్టాంపు డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: