ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం జరుగుతున్న తెలంగాణ ఉద్యమంలో మహిళలు కూడా పెద్దఎత్తున పాల్గొంటున్నారని, ఇదే క్రమంలో త్వరలో తెలంగాణ మహిళా జేఏసీ ఏర్పాటు కానుందని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం వెల్లడించారు. మార్చి 1న తెలంగాణ జేఏసీ భాగస్వామ్యపక్షాలు సహా వివిధపార్టీలు, సంఘాలకు చెందిన మహిళా ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం జరగనున్నట్లు తెలిపారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ మహిళా గెజిటెడ్ అధికారుల సం ఘం ఆధ్వర్యంలో తెలంగాణ జేఏసీ కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడాతూ తెలంగాణ మహిళా జేఏసీ ఏర్పాటు కానుండడం తెలంగాణ ఉద్యమంలో మంచి పరిణామంగా అభివర్ణించారు.  తీవ్రవాదులకు హైదరాబాద్ అడ్డాగా మారిందన్న మంత్రి టీజీ వెంకటేశ్ వ్యాఖ్యలను కోదండరాం తీవ్రంగా ఖండించారు. మంత్రి వెంకటేశ్ తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పడేదాకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే ఉద్యోగినులు సహా మహిళలకు గౌరవం దక్కుతుందన్నారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల మహిళా విభాగం చైర్‌పర్సన్ మమత మాట్లాడుతూ తెలంగాణ కోసం జరుగుతున్న ఉద్యమంలో గతంలో ఎన్నడూ లేనట్లుగా మహిళలు పూర్తి స్థాయిలో పోరాడుతున్నారని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: