రైతుల ప్రభుత్వంగా చెప్పుకునే కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ మరోసారి దాన్ని నిజం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఏడాది బడ్జెట్ లో వ్యవసాయరంగంతోపాటు అనుబంధరంగాలకు ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. దీనికోసం మంత్రి కన్నా లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ కసరత్తు చేస్తోంది. కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటికే వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఆ తరహాలోనే రాష్ట్రంలోనూ అమలు చేయాలని కిరణ్ సర్కార్ ప్రయత్నిస్తోంది. ఆర్థికశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇప్పటికే దీనిపై వ్యవసాయశాఖ, ఆర్థికశాఖ, ప్లానింగ్ శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. ఎన్ని నిధులు కేటాయించాలి, బడ్జెట్ ఎలా ఉండాలి అన్నదానిపై కసరత్తు చేశారు. వ్యవసాయ రంగం బడ్జెట్ లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఉద్యాన వనం, వ్యవసాయం, పశుసంవర్ధకం, ఇరిగేషన్, మార్కెటింగ్ తదితర అనుబంధ రంగాల ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. ఈసారి వ్యవసాయం, ఇతర అనుబంధ రంగాలకు కలిపి దాదాపు 30 వేల కోట్ల వరకూ వ్వవసాయ బడ్జెట్ ఉండొచ్చని అంచనా. బడ్జెట్‌లో వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా తమది రైతు బడ్జెట్‌ అని ప్రకటించడానికి కిరణ్ సర్కార్ కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో విద్యుత్‌ కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ రైతాంగానికి మాత్రం 7 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని.... వ్యవసాయ బడ్జెట్‌తో రైతులకు మరింత చేరువ కావాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కావడంతో రైతులను ఆకట్టుకునే నిర్ణయాలు కూడా ఉంటాయని సమాచారం. మరి కిరణ్ సర్కార్ రైతులకు ఎలాంటి రాయితీలను బడ్జెట్ లో ఇస్తారో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: