అసెంబ్లీలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి తన సత్తా చాటారు. సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి హోదాలో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడారు. సభలో విపక్ష నేతల ఆరోపణలకు, విమర్శలకు ధీటుగా సమాధానం ఇచ్చారు. ముఖ్యంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుపైనా సీఎం ఎదురుదాడి చేశారు. టీఆర్‌ఎస్‌ దయాదాక్షిణ్యాలతో తాను ముఖ్యమంత్రిని కాలేదని.. కాంగ్రెస్‌ పార్టీ వల్లే తాను సీఎం అయ్యానని తేల్చిచెప్పారు. అదే సమయంలో తమ ప్రాంతంలో ఉండాల్సినన్ని మెడికల్ కాలేజీలు లేవని... ఉన్న రెండు కూడా తాము చొక్కాపట్టుకుని ప్రశ్నించడం వల్లే వచ్చాయని హరీష్ అనడంపై కిరణ్ మండిపడ్డారు. చొక్కా పట్టుకోవడానికి నీవేమైనా వీధిరౌడీవా అంటూ హరీశ్‌రావును ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం ఎవరికీ భయపడడు. నిధులు ఇవ్వడంలో ప్రభుత్వానికి ఒక విధానం ఉంటుందని... నీకు భయపడి ఇస్తామనుకుంటున్నావా... అలా అయితే రాస్కో... ఒక్క పైసా కూడా ఇవ్వం ఏం చేసుకుంటావో చేసుకో అంటూ దూకుడుగా బదులిచ్చారు. ఆ తర్వాత లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ వ్యాఖ్యలపైనా సీఎం కిరణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బుతో, బ్రాందీ సీసాలతో ఓట్లను కొనగలమని భావిస్తున్నారా? ఏం మాటలవి? మీ ఒక్కరికే తెలివి ఉందా? ఏమిటీ ప్రవర్తన? ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు. వారిని గౌరవించడం నేర్చుకోండి. ప్రజలు అమ్ముడు పోతారనుకుంటున్నారా? వాళ్లేమైనా అంగడి సరుకు అనుకుంటున్నారా? అంటూ జేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి అవిశ్వాసం తీర్మానం సందర్భంగా సీఎం కిరణ్ తన మార్క్ ను మరోసారి సభలో చూపించారు. అధిష్టానం ఇచ్చిన అండతో చెలరేగిపోయారు. అయితే ఇదంతా టీడీపీ, ఎంఐఎం పార్టీ ఓటింగ్ కు దూరంగా ఉండడం వల్లే సాధ్యమైందన్న వాదన కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: