స్పోర్ట్స్ భామలంతా సినీ ఎంట్రీ ఇచ్చేందుకు ముచ్చటపడుతున్నారు. ఇప్పటికే బ్యాట్మింటన్ స్టార్ గుత్తాజ్వాల నితిన్ సరసన సినీ ఎంట్రీ ఇచ్చింది. హాట్ సాంగ్ చేసి హాట్ టాపిక్ గా మారింది. ఇక టెన్నిస్ స్టార్ సానియా మిర్జా కూడా సినీ ఎంట్రీ ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ భామ అడపాదడపా సినీ కార్యక్రమాలకు హాజరవుతోంది. తాజాగా సినీ ఎంట్రీపై మరో క్రీడాకారిణి ముచ్చటపడుతోంది. అవకాశం వస్తే సినిమాల్లో నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి తెలిపింది. శనివారం విశాఖలో మీడియా ప్రతినిధులతో తన మనసులోని మాట బయట పెట్టింది ఈ పాతికేళ్ల అమ్మాయి. గుత్తాజ్వాల తర్వాత వరుసగా స్పోర్ట్స్ భామలంతా సినీ కెరీర్ పై ముచ్చటపడుతున్నారు. 1987 మార్చి 31న గుడివాడలో పుట్టింది హంపి. 1995లో అండర్‌ 8 నేషనల్‌ ఛాంపియన్‌షిప్‌లో విజయం సాధించడంతో చిన్నారి హంపి కెరీర్‌ ప్రారంభమైంది. అంతర్జాతీయ పోటీలో పాల్గొని అపార శక్తి యుక్తులతో గుర్తింపు తెచ్చుకుంది. తన వయసుతోబాటు క్రీడాపటిమనూ మరింత పెంచుకుంటూ ఎప్పటికప్పుడు విజయాన్ని సొంతం చేసుకోసాగింది. అండర్‌ 10, అండర్‌ 12, అండర్‌ 14 - ఇలా ప్రతి గ్రూపులో టైటిల్స్‌ కైవసం చేసుకుంటూ ధీమాగా ముందుకు సాగింది. క్రమంగా కెరీర్‌ గ్రాఫ్‌ అదరహో అనిపించింది. 1999లో పన్నెండేళ్ళ వయసులో ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ టైటిల్‌ దక్కించుకుంది. తర్వాత హంగేరీలో జరిగిన ఎలెక్స్‌ మెమోరియల్‌ గ్రాండ్‌ మాస్టర్‌ టోర్నమెంట్‌లో మూడో గ్రాండ్‌ మాస్టర్‌ కితాబుతో విశిష్ఠ స్థానంసంపాదించింది. జుదిత్‌ పోల్గార్‌ రికార్డును బద్దలుకొట్టి పదిహేనేళ్ళ వయసుకే అంతర్జాతీయ గ్రాండ్‌ మాస్టర్‌ టైటిల్‌తో ప్రపంచ రికార్డు సృష్టించింది. తర్వాత 2008లో హోయిఫాన్‌ పద్నాలుగేళ్ళ ఆర్నెల్ల వయసుకే ఈ టైటిల్‌ సొంతం చేసుకుని హంపి రికార్డును బ్రేక్‌ చేసింది. ఏదేమైనా చదరంగ క్రీడలో ఇంటర్నేషనల్‌ గ్రాండ్‌ మాస్టర్‌ పతకాన్ని అందుకున్న తొలి భారతీయ మహిళ కోనేరు హంపి. 2001లో ప్రపంచ జూనియర్‌ ఛెస్‌ ఛాంపియన్‌షిప్‌ గెలుచుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: