హైదరాబాద్: తిరుపతి, షిర్డీలకు వెళ్లేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడు విజయసాయి రెడ్డికి కోర్టు శుక్రవారం అనుమతి ఇచ్చింది. ఈ నెల 13వ తేదీ నుంచి 20వ తేదీ వరకు విజయసాయి రెడ్డి ఆ రెండు యాత్రలకు వెళ్లేందుకు కోర్టు అనుమతించింది. ఏ తేదీల్లో ఎక్కడుంటారో సిబిఐకి సమాచారం ఇవ్వాలని కోర్టు విజయసాయి రెడ్డిని ఆదేశించింది. తిరుపతి, షిరిడీ వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అక్రమాస్తుల కేసులో రెండో నిందితుడు విజయసాయి రెడ్డి కోర్టులో గురువారం పిటిషన్ దాఖలు చేశారు. అయితే, అందుకు సిబిఐ గురువారం తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఈ నెల 9, 10 తేదీల్లో విజయసాయి రెడ్డిని విచారించాల్సి ఉందని, ఈ నెల 11వ తేదీన జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి హాజరు కావాల్సి ఉందని సిబిఐ కోర్టుకు తెలిపింది. ఈ నెల 13వ తేదీ తర్వాత విజయసాయి రెడ్డి యాత్రకు అనుమతిస్తే అభ్యంతరం లేదని సిబిఐ తెలిపింది. దీంతో ఈ నెల 13వ తేదీ తర్వాత షెడ్యూల్ ఇస్తే అనుమతించే విషయాన్ని పరిశీలిస్తామని కోర్టు విజయసాయి రెడ్డికి తెలిపింది. సిబిఐ తెలిపిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ఈ నెల 13 నుంచి తిరుపతి, షిర్డీ వెళ్లేందుకు కోర్టు విజయసాయి రెడ్డికి అనుమతి ఇచ్చింది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి) అక్రమ మైనింగ్ కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు అలీఖాన్‌ను తమకు అప్పగించాలని కోరుతూ సిబిఐ దాఖలు చేసిన పిటి వారంట్‌పై వాదనలు శుక్రవారం ముగిశాయి. కోర్టు ఆ విషయంపై ఈ నెల 14వ తేదీన తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. సిబిఐ స్వాధీనం చేసుకున్న తమ హెలికాప్టర్ సహా ఇతర వాహనాలను తమకు ఇప్పించాలని కోరుతూ గాలి జనార్దన్ రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్‌పై తీర్పును కోర్టు ఈ నెల 12వ తేదీన వెలువరించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: