టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు సరికొత్త ఎత్తులతో ముందుకు సాగుతున్నారు. టీఆర్ఎస్‌ను బలోపేతం చేయడంతోపాటు...ప్రత్యర్థి పార్టీలను బలహీనపరుస్తూ...ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్టు ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ టీఆర్ఎస్ గూటికి చేరుతున్నట్టు ప్రకటించారు. ఇక అదే జిల్లాలోని చొప్పదండి ఎమ్మెల్యే సుద్ధాల దేవయ్య కూడా కేసీఆర్‌కు జై కొట్టబోతున్నట్టు సమాచారం. కేసీఆర్ తనయుడు కేటీఆర్ కూడా ఇదే వ్యూహంతో ఉన్నట్టు తెలుస్తోంది. రాబోయేదంతా సంకీర్ణ యుగమేనని, టీఆర్ఎస్ చక్రం తిప్పడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.  అంతేగాకుండా తెలంగాణవాదం బలంగా ఉండేందుకు అవసరమైతే తెలంగాణ పొలిటికల్ జేఏసీ నేతలకు కూడా టిక్కెట్లు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. అవసరాన్ని బట్టి, సర్వేల ఆధారంగా జేఏసీలోని కీలక నేతలకు కూడా టికెట్లు కేటాయిస్తామని కేటీఆర్ తెలిపారు. నాయిని నర్సింహారెడ్డి ఆధ్వర్యంలోని ఎన్నికల కమిటీ నివేదిక ఇచ్చాక కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని కేటీఆర్ చెప్పారు. అంతేగాకుండా టీఆర్ఎస్ ఆకర్ష్ లో రంగారెడ్డి జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు ప్రముఖంగా ఉన్నట్టు సమాచారం. కేఎస్ రత్నం, మహేందర్ రెడ్డి, ప్రకాశ్‌ గౌడ్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం స్పందించలేదు. మొత్తానికి ఈనెల 27న నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో జరగనున్న పార్టీ ఆవిర్భావ సదస్సులో మరింత మంది టీఆర్ఎస్ లో చేరతారని అంతా భావిస్తున్నారు. ఈ సభ ద్వారా కేసీఆర్ తన సత్తా చాటే ఆలోచనలో ఉన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: