హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ మరోసారి రణరంగంగా మారింది. సమైక్యవాదిగా పేరున్న ప్రముఖ నేత పరకాల ప్రభాకర్ రాసిన 'రుజువుల్లేని ఉద్యమం' పుస్తకావిష్కరణ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. తెలంగాణ వాదులకు, విశాలాంధ్ర మహా సభ ప్రతినిధులకు మధ్య వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. పరిస్థితి అదుపులోకి రావడానికి పోలీసులకు గంటకు పైగా సమయంపట్టింది.  పుస్తకావిష్కరణ కార్యక్రమం జరుగుతుందని తెలసుకున్న ఓయూ విద్యార్ధి నేతలు, తెలంగాణ న్యాయవాదులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. పుస్తకావిష్కరణ జరిగిన కొద్ది నిమిషాల్లోనే తెలంగాణ జర్నలిస్టులు నిరసనకు దిగారు. ఈపుస్తకాన్ని జనవరి 22 నుంచి జనం మందుకు తీసుకువస్తున్నా... ఒక్కరు కూడా స్పందించలేదని ఇది తెలంగాణ ఉద్యమ డొల్లతనమని పరకాల ప్రభాకర్ అనగానే తెలంగాణ జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. రుజువులేని ఉద్యమం పుస్తకాన్ని చించి, కాల్చి నానా హంగామా చేశారు.. పరకాల తెలంగాణ ఉద్యమంపై విషంచిమ్ముతున్నారని ఒక ప్రాంతాన్ని కించపరిచేవారిని ప్రెస్ క్లబ్ లోకి ఎలా అనుమతిస్తారని తెలంగాణ జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రెస్ క్లబ్ అద్దాలను ధ్వంసం చేసారు. విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులను బయటకు లాగేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు రెండువర్గాలను అదుపుచేశారు.. తెలంగాణ జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకుని పరకాల బృందాన్ని అక్కడి నుంచి తరలించారు. ఈదాడిలో పలువురు జర్నలిస్టులు, విశాలాంధ్ర ప్రతినిధులకు గాయాలయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: