బెల్టుషాపులు ఎత్తివేస్తామంటున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హామీ అమలు సాధ్యమేనా అనే చర్చ ఇప్పుడు తెరపైకి వస్తోంది. ఇది కిరణ్ అనుసరిస్తున్న ఎన్నికల స్టంటా? ప్రభుత్వానికి అధిక ఆదాయం తెచ్చిపెట్టే మద్యం అమ్మకాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుందా? అనే విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

అంత ఈజీ కాదు..?
ప్రభుత్వానికి అధిక ఆదాయం మద్యం అమ్మకాల ద్వారానే వస్తోంది. ఏడాదికి సుమారు 19వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు వచ్చిచేరుతోంది. అయితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బెల్టు షాపులు రద్దుచేస్తామంటూ ప్రకటన చేయడంతో ఇది అమలు సాధ్యమేనా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. చంద్రబాబు హయాంలో ప్రారంభమైన బెల్టుషాపులు ఇప్పుడు గ్రామాల్లో విచ్చలవిడిగా పెరిగిపోయాయి. గతంలో వైఎస్ కూడా దశలవారీగా ఎత్తేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఆచరణలో మాత్రం సాధ్యంకాలేదు. ప్రతిపక్షాలు సైతం బెల్టుషాపులు ఎత్తేయడం ఎవరి తరం కాదంటున్నాయి. తమిళనాడు తరహాలో చౌక దుకాణాల్లో అమ్మకాలు చేయడమే పరిష్కారమంటున్నారు.

గ్రామాల్లో మద్యం ఏరులై పారుతుండటంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. అంతేకాదు అనేక కుటుంబాలు కూడా ఆర్ధికంగా చితికిపోతున్నాయి. ఇక యువత అయితే మద్యం మత్తులో తూగడమే కాకుండా నేరాలకు సైతం పాల్పడుతున్నారంటే బెల్టుషాపుల ప్రభావం ఎంతో అర్థంచేసుకోవచ్చు. అయితే ముఖ్యమంత్రే స్వయంగా బెల్టుషాపులు ఎత్తివేస్తామని ప్రకటించారంటే.. ఇవన్నీ ప్రభుత్వ అండదండలతోనే నడుస్తున్నాయని చెప్పవచ్చు.

లక్షలాది 'బెల్టు'లు..
రాష్ట్రంలో అధికారికంగా 5979 వైన్ షాపులు, 1458 బార్లు ఉన్నాయి. అయితే వైన్స్ నుంచే బెల్టుషాపులు పుట్టుకొచ్చాయి. ఎక్సైజ్ శాఖ లెక్కల ప్రకారం లక్షకుపైగా బెల్ట్ షాపులు ఉంటే, మరి అనధికారింగా ఇంకెన్ని ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మారుమూల పల్లెల్లో సైతం మద్యం అందుబాటులో ఉంటోంది. ఇటువంటి పరిస్థితుల్లో బెల్ట్ షాపులు ఎత్తివేస్తామని సీఎం ప్రకటించడం సాహసోపేతమైన నిర్ణయమేనని చెప్పాలి. అయితే దీనికి ఒక్కటే మార్గం కనబడుతోంది. ప్రభుత్వమే మద్యం దుకాణాలను నడపడం ద్వారా బెల్ట్ షాపులను రూపుమాపవచ్చు. ఇప్పటికే మద్యం సిండికేట్ల దందాకు చెక్ పెట్టిన కిరణ్ కుమార్ రెడ్డి.. బెల్ట్ షాపులను కూడా రద్దుచేస్తే మరో మంచి విజయమేనంటున్నారు మంత్రులు.

బెల్టుషాపులు ఎత్తివేయడంతోపాటు గ్రామాల్లో గుడుంబా, నాటుసారాను కట్టడి చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. లేకపోతే బ్రాందీ పోయి.. నాటుసారా ఏరులై పారే ప్రమాదముంది.

మరింత సమాచారం తెలుసుకోండి: