హైదరాబాద్: ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి విభిన్నమైన వ్యక్తి. ఎవరేం అనుకున్నా, ఎన్ని విమర్శలు, ఆరోపణలు చేస్తున్నా ఆయన పనులను ఆయన చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. లక్షలాది మంది పేద విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్ మెంటు పథకంలో పార్టీ, సర్కార్ వెలపల, బయట అనేక విధాలుగా విమర్శలు, అసంత్రుప్తులు వెల్లివెత్తుతున్నా అవేమీ పట్టించుకోకుండా ఆయన ఖమ్మం జిల్లా ఇందిరమ్మ బాటకు వెళ్లారు. నిన్నటి శ్రీకాకుళం పర్యటనలో రైతుగా పొలం పనుల్లో నిమగ్నమైన సీఎ కిరణ్ నేటి ఖమ్మం పర్యటనలో సింగరేణి కార్మికుని అవతారం ఎత్తారు. బొగ్గగునుల్లోకి దిగారు. బొగ్గును ఎలా తవ్వి ఇస్తారో ప్రత్యక్షంగా పరిశీలించారు. అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉంటే, ఫీజుల ఎత్తివేతపై వరుసగా రెండో రోజు కూడా రాష్ర్ట వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, వివిధ పార్టీల నాయకులు, అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ వీహెచ్, మాజీ మంత్రి కోమటి వెంకట్ రెడ్డి దుమ్మెత్తిపోశారు.  ఫీజుల విషయంలో సీఎం కిరణ్ మాత్రం తాను అనుకున్నట్లుగానే సాగిపోతున్నారు తప్ప పునరాలోచన చేస్తామనీ ఎక్కడా చెప్పడం లేదు. మూడు రోజుల ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా ఈ రోజు మణుగూరు, ఇల్లందు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఆయన బస్సులో ప్రకాశం భూగర్భ గనిని సందర్శించారు. కార్మికుల దుస్తులను ధరించిన కిరణ్ 600మీటర్ల మ్యాన్ రైడింగ్ ద్వారా లోపలికి వెళ్లి అక్కడ బొగ్గు తీసే విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. కార్మికులతో మాట్లాడారు. ఇల్లందులో సింగరేణి కార్మికులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: