సాధారణంగా ఓ పొలిటికల్ పార్టీకి మరో పార్టీకి మధ్య గొడవ ముదరడం సాధారణమే. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ - ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్ మధ్య వివాదం తారస్థాయికి చేరుతోంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) పైన న్యూస్ ఛానల్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అన్న సెటిల్‌మెంట్’ పేరుతో సీమాంధ్ర బిల్డర్ల మధ్య సెటిల్‌మెంట్ చేస్తున్న గులాబీ అన్న బాగోతం అంటూ వంద కోట్ల వ్యవహారం సెటిల్మెంట్ అని కేటీఆర్ పైన కథనం ప్రసారం చేసింది.

ఈ కథనంపై టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఏబీఎన్ కథనంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఒక వ్యక్తిని కావాలని టార్గెట్ చేస్తున్నారని, వాటిని నిరూపించాలని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు సవాల్ విసిరారు. నిరూపిస్తే పార్టీ పరంగా తాము ఎలాంటి చర్చకైనా సిద్ధమన్నారు. రాధాకృష్ణ తీరు కొండను తవ్వి ఎలుకను తీసినట్లుగా ఉందన్నారు. ఉద్యమ నేతలను కళంకితులను చేయడం ద్వారా, ఉద్యమాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు, పార్టీ నేత శ్రవణ్ కుమార్ తదితరులు స్పందించారు. టిడిపి కుట్రలో భాగంగానే రాధాకృష్ణ ఇలాంటి కథనాలు ప్రసారం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రాంతంలో తెరాసను ఎదుర్కోలేని టిడిపి ఏబీఎన్‌ను అడ్డుపెట్టుకొని ఇలాంటి అవాస్తవాలు చెబుతోందన్నారు. ఏబీఎన్ కథనాల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. సీమాంధ్ర మీడియా తెలంగాణ ఉద్యమంపై విషం కక్కుతోందన్నారు. ఇది కెటిఆర్ పైన దాడి కాకుండా.. ఉద్యమం పైన దాడిగా చూస్తున్నామన్నారు. ఆంధ్రా మీడియా ఎన్ని కుట్రలు చేసినా ఉద్యమ ప్రభావం ఏమాత్రం తగ్గదన్నారు. టిడిపిని పైకి తెచ్చేందుకు, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు, టిఆర్పీ రేటింగ్ పెంచుకునేందుకు ఏబీఎన్ ఇలా చేస్తోందని ఆరోపించారు.

పరువు నష్టం దావా వేస్తా

తనపై వార్త కథనం ప్రసారం చేసిన ఏబీఎన్ చానల్ పై కేటీఆర్ నిప్పులు కక్కారు. ఏబీఎన్ టీడీపీకి అనుబంధ సంస్థ, అధికారిక పత్రిక అని కేటీఆర్ ఆరోపించారు. తనపై అసత్య ఆరోపణలు చేసిన ఏబీఎన్‌పై ఆయన నిప్పులు చెరిగారు. రాధాకృష్ణ ఎవరికి బినామీగా పని చేస్తున్నారో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు అని చెప్పారు. పనికిమాలిన, పసలేని, పొంతనలేని అసత్య ప్రచారం చేస్తున్నది అని మండిపడ్డారు. తనపై చేసిన ఆరోపణలు నిరాధారమని రేపు సాయంత్రంలోగా ఏబీఎన్ ఛానల్, ఆంధ్రజ్యోతి పత్రిక ద్వారా క్షమాపణలు చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని కేటీఆర్ స్పష్టం చేశారు. ఏబీఎన్ అంటే ఆంధ్రాబ్లాక్ మెయిలింగ్ నెట్‌వర్క్ అని చెప్పారు. రాధాకృష్ణను ఎల్లో జర్నలిజం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: