ఏపీలో సంప్రదాయంగా సాగే కోడి పందాలు తెలంగాణకు కూడా చేరాయి. రాష్ట్రానికి సరిహద్దు ప్రాంతాలైన ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు ఈ పందాలకు నిలయంగా మారాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రధానంగా అశ్వారావుపేట, దమ్మపేట, చంద్రుగొండ, ములకలపల్లి, దుమ్ముగూడెం, పాల్వంచ, సత్తుపల్లి మండలాల్లో  కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. పండుగ మూడు రోజుల పాటు భారీ స్థాయిలో డబ్బు చేతులు మారబోతుంది. 


పందెం బరిలోకి దిగిన తమ పుంజు..గెలవడం స్టేటస్ భావించే పందెం రాయుళ్లు..లక్షలు, వేలు ఖర్చుపెట్టి జాతి కోళ్లను కొనుగోలు చేశారు. వాటికి రెండు పూటలా బలవర్ధకమైన తిండి పెట్టి కయ్యానికి సిద్ధం చేశారు. ప్రత్యర్ధి పుంజుతో ఎలా పోరాడాలో తర్ఫీదు ఇప్పించారు. దీంతో  పందెం కోళ్లు.. పౌరషంతో రగిలిపోతున్నాయి. బరిలో దూకేందుకు కాలు దువ్వుతున్నాయి.


కోడిపందాల నిర్వహణలో ఏటా సుమారు ఐదు కోట్ల వరకు చేతులు మారుతుంటాయి. కేవలం అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లోని సరిహద్దు ప్రాంతాల్లో జరిగే పందాల్లో 2కోట్లు, జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో 3కోట్లు చేతులు మారుతుంటాయని అంచనా. నేరుగా పందెం కాసేవాళ్లు బిర్రు లోపల ఉంటే పై పందేలు కాసే వాళ్లు బయట ఉంటారు. లోపలి పందాలు లక్షల్లో ఉంటే బయట ఒక్కొక్కరు 5 వేల నుంచి 20వేల వరకు పందాలు కాస్తుంటారు. 


ఖమ్మం, భద్రాచలం జిల్లాల్లో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయనటానికి పోలీసుల దాడులే నిదర్శనం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ డివిజన్‌లో ఇప్పటి వరకు 18 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పోలీసులు దాడులు చేస్తున్నా పందెం రాయుళ్లు మాత్రం ఆగడం లేదు. పోలీసులు వచ్చే సమాచారాన్ని ముందుగానే అందుకునేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: