రాష్ట్ర రాజకీయాలు మంగళవారం మరోసారి జాతీయతెరపై మెరవనున్నాయి. దివంగత ముఖ్యమంత్రి జయ లలిత అన్న కుమార్తె దీప రాజకీయ అరంగేట్రమే ఇందుకు కారణం. తన రాజకీయ ప్రవేశం సందర్భంగా దీప చేయ బోయే ప్రకటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. త‌మిళ నాడు సీఎం  జయలలిత చనిపోయి 40 రోజులు దాటింది. ఇప్పటికీ తమిళ నాడులో అంతా ఆమె గురించే చర్చ జరుగుతుంది. ఆమె మరణం తో అక్కడ ఏర్పడిన రాజకీయ వెలితి అలాగే ఉండిపోయింది. అన్నాడీఎంకే నాయకులంతా జయలలిత మరణం తో పార్టీని ఎవరు ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలో పడ్డారు. 


ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ నాయకులు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఒక వర్గం వారు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కు మద్దతు తెలుపగా, మరొక వర్గం వారు జయలలిత సన్నిహితురాలు శశికళ వైపు మొగ్గు చూపారు. పార్టీ లో నెలకొన్న ఈ గందరగోళ పరిస్థితుల మద్యే శశికళ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టారు. ఇది ఇష్టం లేని కొందరు అన్నాడీఎంకే నాయకులూ, కార్యకర్తలు జయలలిత మేనకోడలు దీపను శశికళను పోటీగా రాజకీయాలలోకి రావాలని కోరుతున్నారు. దానికి ఆమె కూడా సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.

పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపికను సహించలేక రగిలి పోతున్నవారంతా తమ ప్రయత్నాలు తాము చేసు కుంటున్నారు. వీరిలో అధికశాతం మంది అన్నాడీఎంకేపై అభిమానాన్ని చంపుకోలేక, అలాగని శశికళ నాయక త్వంలో ఇమడలేక నలిగిపోతున్నారు. శశికళ బొమ్మలను చింపివేయడం ద్వారా తమ నిరసనను చాటుకుంటు న్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్న ద్వితీయ శ్రేణి మొదలుకుని కింది స్థాయి కార్యకర్త వరకు అధిక శాతం లోలోన దీప వైపు మొగ్గు చూపుతున్నారు.  

రాజకీయాల్లో అమ్మ లేని లోటును తీర్చాలంటూ దీపపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో చెన్నై టీనగర్‌లోని దీప ఇంటి పరిసరాలు అభిమానుల నినాదాలతో మార్మోగుతు న్నాయి. ప్రతిరోజు తండో పతండాలుగా వస్తున్న జనా న్ని దీప కలుసుకుంటున్నారు. సమయం వచ్చినపుడు రాజకీయ ప్రవేశం ఖాయమని నచ్చజెబుతూ వచ్చారు. ఇప్పటికే చాలామంది దీప మద్దతుదారులు ‘దీపా పేరవై’ అనే సంస్థను స్థాపించి సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా చేపట్టారు. 

అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ శత జయంతి ఉత్సవాల ప్రారంభదినమైన ఈ నెల 17వ తేదీన తాను రాజకీయాలలోకి అరంగేట్రం చేయబోతున్నామని దీప కూడా ప్రకటించారు. దీంతో తమిళనాడు ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆమె ప్రతి అడుగు అన్నాడీఎంకేలోని శశికళ వర్గం వారు గమనిస్తూనే ఉన్నారు. ఆమెకు కౌంటర్ ఇవ్వడానికి వారంతా సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. అధి కార అన్నాడీఎంకే నుంచి ఎదురవుతున్న ఇటువంటి ప్రతిఘటన వాతావరణంలో దీప తన రాజకీయ భవిష్యత్తు కు మంగళవారం పునాదులు వేయడం ప్రారంభిస్తున్నారు. 

రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన దీప తన పేరుతో వెలసిన పేరవైలో చేరుతారా, కొత్త పార్టీ పెడతారా, అలాగాక మరేదైనా ప్రముఖ పార్టీలో చేరుతారా అనే ఆలోచనలతో ఉత్కంఠ నెలకొని ఉంది. తన కోసం ఇంటికి వచ్చే అభిమానులకు రెండాకుల చిహ్నం వలె రెండు వేళ్లను చూపుతుండగా ప్రజలు కేరింతలు కొడుతున్నారు. తన అభిమానులు ఆశిస్తున్న బాటనే ఎంచుకుంటానని సోమవారం సైతం తన ఇంటి వద్ద దీప స్పష్టం చేశారు. అలాగని అన్నాడీఎంకేలో చేరే అవకాశం లేదు. ఇంతకూ దీప రాజకీయ నిర్ణయం ఎలా ఉండబోతోందోనని అన్ని పార్టీల్లోనూ ఆసక్తి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: