ప్రత్యేక హోదా పోరు క్రెడిట్ ను జనసేన హైజాక్‌ చేస్తుందని జగన్‌ భయపడుతున్నారా ? స్పెషల్‌ స్టేటస్‌ కోసం పోరాటం చేస్తోంది తామే అని నిరూపించుకునేందుకు జగన్‌ ఆరాటపడుతున్నారా ? ఒకవైపు ఎమ్మెల్యేల వలస.. మరోవైపు పవన్‌ కళ్యాణ్‌.. వైసీపీని డిఫెన్స్‌లో నెట్టేస్తున్నాయా ? కొద్దిరోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే.. ఎవరికైనా ఈ అనుమానాలు రాకమానవు.


ఏపీకి ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదట్నుంచి ఆందోళనలు చేస్తూనే ఉంది. వివిధ మార్గాల్లో నిరసన ప్రయత్నాలు తెలిపింది. ఆపార్టీ అధినేత వైఎస్ జగన్ కూడా ప్రత్యేక హోదా యువభేరీ,  హోదా ఉద్యమాలు, ఆందోళనలు నిర్వహించారు. రాష్ట్రపతిని కలిసి వినతి పత్రాలు సమర్పించారు. ఓటుకు  నోటు కేసులో ప్రత్యేక హోదా విషయాన్ని కేంద్రం వద్ద చంద్రబాబు తాకట్టు పెట్టారంటూ జగన్ అనేక సార్లు  విమర్శించారు. హోదా విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదంటూ మండిపడ్డారు. ప్రతిపక్షంగా ప్రత్యేక హోదా కోసం పోరాడతామన్నారు. తన వద్ద బ్రహ్మాస్త్రం ఉందని అవరసమైతే దానిని వాడుతానంటూ ప్రకటించారు.  తమ ఎంపీలతో రాజీనామా చేయిస్తానన్నారు. హోదా పోరు కోసం ఎవరు కలిసొచ్చినా తమకు అభ్యంతరం లేదని, పార్లమెంట్ వేదికగా పోరాటం సాగిస్తామన్నారు. 


ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ఏ అంశాన్ని జగన్ వదల్లేదు. అన్నదాతల సమస్యలు, తాగు, సాగునీటి సమస్యలపై దీక్షలు చేపట్టారు. వీలు చిక్కినప్పుడల్లా ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. త్వరలో ప్రభుత్వం  పడిపోతుందని, వచ్చే ప్రభుత్వం తమదేనని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. విశాఖ ఎయిర్ పోర్టులో పోలీసులు అడ్డుకున్నప్పుడు జగన్ ఆవేశంతో ఊగిపోయారు. కాబోయే ముఖ్యమంత్రిని ఆపుతారా.. రెండేళ్లలో ముఖ్యమంత్రిని అవుతా.. అప్పుడు మీ సంగతి తేలుస్తా.. అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పోలీసులపై మండిపడ్డారు. జనవరి 26న ప్రత్యేక హోదాపై  ప్రభుత్వాల తీరుకు నిరనసగా వైసీపీ చేపట్టిన క్యాండిల్ ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన్ను.. విశాఖ ఎయిర్ పోర్టులో పోలీసులు అడ్డుకున్నారు. తరువాత హైదరాబాద్ చేరుకున్న జగన్.. దేవుడు దయతలిస్తే.. ఏడాదిలో ప్రభుత్వం  పడిపోతుందని, తరువాత వచ్చే ప్రభుత్వం తమదేనని పునరుద్ఘాటించారు 


2014 ఎన్నికల తరువాత నుండి వైసీపీ అధినేత జగన్ కు అధికార టీడీపీ షాకుల మీద షాకులిస్తోంది. పార్టీ ఫిరాయింపులను పోత్సహించి దాదాపు సగం మంది ఎమ్మెల్యేలను తమవైపు లాగేసుకుంది. అంతేకాకుండా..  కాబోయే ముఖ్యమంత్రి తానేనంటూ జగన్ అనడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. జగన్ ఫ్రస్టేషన్ లో ఉన్నారంటూ విమర్శలు చేసింది. తండ్రి మరణంతో ముఖ్యమంత్రి కావాలనుకున్న ఆశ నెరవేరక పోవడంతో.. జగన్  ఆభ్రమలో బతుకుతున్నారని ఎద్దేవా చేసింది.


జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తనకున్న ప్రజాకర్షణతో సమస్యలపై స్పందిస్తూ నెమ్మెదిగా జనంలోకి చొచ్చుకుపోతున్నారు. అదే ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ లో మార్పులకు కారణమైందనే వాదనలు  వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో తమకు జనసేన పోటీ కాబోతుందున్న విషయాన్ని గ్రహించిన జగన్.. ఆ పరిస్థితులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. జనం జనసేన వైపు  మొగ్గు చూపితే చివరకు జరిగేదేమిటో ముందే గ్రహించి.. రాబోయే ఉపద్రవాన్ని ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. 


టీడీపీకి సిసలైన ప్రత్యామ్నాయం తానేనని నిరూపించుకునేందుకు జగన్ తన పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పాలనపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని త‌న పార్టీకి ఓట్ల వ‌ర్షంగా  మార్చుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నేప‌థ్యంలో రానున్న రోజుల్లో ఏపీ వ్యాప్తంగా జై ఆంధ్రప్రదేశ్ పేరుతో ఐదు భారీ బహిరంగ సభల్ని నిర్వహించాలని వైసీపీ అధినేత  డిసైడ్ అయిన‌ట్టుగా తెలుస్తోంది. ఈ ఐదు  భారీ సభలు ఎక్కడ  నిర్వహించ‌నున్నార‌న్న అంశాన్ని మాత్రం ఆ జ‌గ‌న్ పార్టీ ఇంకా బ‌య‌ట‌పెట్టలేదు. అయితే మొదటిసభను మాత్రం  విశాఖపట్నంలో నిర్వహించాలని నిర్ణయించారు.  టీడీపీ వైఫ‌ల్యాల‌ను ప్రజ‌ల్లో  ఎండ‌గ‌ట్టడం, ఏపీకి ప్రత్యేక హోదా రాకుంటే వ‌చ్చే స‌మ‌స్యల‌పై  ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం, త‌ద్వారా ప్రత్యేక హోదా సెంటిమెంట్‌ను ర‌గిలించి, దాన్ని వ‌చ్చే ఎన్నిక‌ల‌దాకా స‌జీవంగా ఉండేలా ప్రయత్నించేందుకు ఈ  బ‌హిరంగ స‌భ‌ల‌ను వినియోగించుకోవాల‌న్నది జగన్ ఆలోచనగా చెబుతున్నారు.


ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజ‌ల్లో ఉన్న ఇమేజ్ ను గ‌ట్టిగా దెబ్బతీసేందుకు జై ఆంధ్రప్రదేశ్ స‌భ‌ల కాన్సెప్ట్  తమకు ఉప‌క‌రిస్తుంద‌ని నమ్ముతున్న వైసీపీ అధినేత .. ఆ అంశంలో ఏమేరకు విజయవంతం అవుతారో  చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: