కేంద్ర వార్షిక బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి సెంట్రల్ హాల్‌లో ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ప్రసంగంతో ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి. అనంత రం అరగంట విరామం తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఆర్థిక సర్వేను పార్లమెంటుకు సమర్పిస్తారు. రెండు వితడలుగా జరిగే బడ్జెట్ సమావేశాల్లో తొలి సెషన్ జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 9వ తేదీ వరకు, రెండో సెషన్ మార్చి 9వ తేదీ నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు జరుగుతుంది. ఐదు రాష్ట్రాల్లో  అసెంబ్లీ ఎన్నికలు మార్చి 8వ తేదీతో ముగుస్తున్నందున 9వ తేదీ నుంచి రెండవ సెషన్ ప్రారంభమవుతుంది. 

ఆనవాయితీ ప్రకారం బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి చివరి వారంలో ప్రారంభం కావాల్సి ఉంది. ఫిబ్రవరి నెల చివరి రోజున వార్షిక బడ్జెట్‌ను పార్లమెంటుకు సమర్పించేవారు. కానీ.. ఈసారి నెల రోజులు ముందుగానే బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. దీనికి తోడు రైల్వే బడ్జెట్‌ను కూడా కేంద్ర బడ్జెట్‌లో విలీనం చేసినందువల్ల రైల్వే బడ్జెట్‌పై జరిగే చర్చా సమయాన్ని కూడా ఆదా చేయడానికి వీలు కలిగింది. రెండో విడత సమయంకల్లా యూపీ సహా ఐదు రాష్ట్రాల‌ ఎన్నికల ఫలితాలు కూడా వెల్లడవుతాయి. వాటిలో ప్రజాతీర్పు బీజేపీకి వ్యతిరేకంగా ఉంటే అధికార పక్షాన్ని ఇరుకున పెట్టడానికి విపక్షాలు ఎదురుచూస్తున్నాయి. 

కేంద్రం 39 కొత్త బిల్లులు (ద్రవ్య బిల్లుల్ని కలుపుకుని), ఇప్పటివరకూ పెండింగ్‌లో ఉన్న బిల్లుల ఆమోదం పొందాలని భావిస్తున్నది. దేశ అభివృద్ధి కోసం బడ్జెట్ సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ పలు విపక్ష పార్టీలకు పిలుపునిచ్చారు. ఎన్నికల వేళ పార్టీల మధ్య భిన్నాభి ప్రాయాలు, అభిప్రాయ భేదాలు ఉండవచ్చుగానీ దేశ హితం కోసం సమావేశాలకు సహకరించాలని కోరారు. మం గళవారం నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సోమవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. 

ఈ సమావేశానికి హాజరైన మోదీ ఈ బడ్జెట్ సమావేశాలను మహా పంచాయతీగా అభివర్ణించారు. విపక్షాలు లేవ నెత్తే ఏం అంశంమీదనైనా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని స్పష్టం చేశారు. శీతాకాల సమా వేశాల్లో నోట్ల రద్దు నిర్ణయం కారణంగా సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించిన అంశాన్ని గుర్తుచేసి ఈ సమావేశాలైనా సజావుగా జరగాలని కోరారు. అఖిలపక్ష సమావేశాన్ని తృణమూల్ కాంగ్రెస్, శివసేన బహిష్కరిం చాయి. నోట్ల రద్దు నిర్ణయానికి నిరసనగా ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు రెండు పార్టీలూ స్పష్టం చేశాయి. 

సమావేశం అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్ మీడియాతో మాట్లాడుతూ స్వయంగా ఆచరణాత్మక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని, ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే నూతన ఆర్థిక సంవ త్సరం నుంచే కేటాయింపులు జరుగాలన్న ఉద్దేశంతో బడ్జెట్‌ను ముందుకు జరుపాల్సి వచ్చిందని వివరిం చారు. ఐదు రాష్ట్రాల‌ ఎన్నికలపై ఈ బడ్జెట్ ఎలాంటి ప్రభావం చూపిందని స్పష్టంచేశారు. 2012లో ఇదే పరిస్థితి తలెత్తినప్పుడు ఐదు రాష్ట్రాల  అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అప్పటి యూపీఏ ప్రభుత్వం బడ్జెట్‌ను ఎన్నికల ఫలితాలు వెలువడేంత వరకు వాయిదా వేసిందని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ చెప్పారు. 

ఈ సారి కూడా అదే నిర్ణయం జరిగి ఉంటే బాగుండేదని అన్నారు. ఇప్పటికీ ప్రజలపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఉన్నదని, చర్చకు ప్రభుత్వం అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సైతం పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై తొలి విడత సమావేశాల్లోనే చర్చ జరుగాలని అన్నారు.పెద్ద నోట్ల రద్దు అంశంపై చర్చించాలని పలు రాజకీయ పార్టీలు కోరిన నేపథ్యంలో ఈ అంశంపై సభా సలహా సంఘం నిర్ణయం తీసుకోనుంది. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో పలు రాజకీయ పార్టీలు ఈ డిమాండ్‌ను ముందుకు తీసుకువచ్చాయి. 

అఖిలపక్ష సమావేశం తర్వాత అన్ని పార్టీల నేతలకు స్పీకర్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ విషయం చెప్పారు. గత శీతాకాల సమావేశాల్లో 193వ నిబంధన కింద మొదలై, మధ్యలోనే ఆగిపోయిన పెద్ద నోట్ల రద్దుపై చర్చను కొనసాగించాలని కోరామని టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత జితేందర్ రెడ్డి చెప్పారు. తెలంగాణ అంశాలను ఈ బడ్జెట్‌లో పెట్టడంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పష్టమైన విజ్ఞప్తి చేశామన్నారు. తెలంగాణకు సంబంధించి ఎయిమ్స్, ఐఐఎం, రైల్వే ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు, వెనుకబడిన ప్రాంతాలకు అభివృద్ధి నిధులు ఇలా అనేక అంశాలు ఉన్నాయని తెలిపారు. 

విభజన చట్టంలోని పెండింగ్ అంశాల గురించి కూడా ఈ సమావేశాల్లో చర్చకు పట్టుబడతామని చెప్పారు. డిజిటల్ లావాదేవీల్లో తెలంగాణ ముందు వరుసలో ఉందని, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం తగిన సహకారాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్ కోసం అన్ని వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఐదు రాష్ట్రాల‌కు జరుగుతున్న ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఆయా రాష్ట్రాల‌కు మాత్రమే వరాలు కురిపిస్తే ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. బడ్జెట్‌లో కేటాయింపులపై ఆచితూచి అడుగేయాలనుకుంటున్నాయి.

పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాత ఆర్థిక వృద్ధి రేటు 2శాతం వరకు పడిపోతుందని కాంగ్రెస్, ఇతక విపక్షాలు తొలి నుంచి పేర్కొంటున్నాయి. వీరి అంచనాలకు అనుగుణంగా బడ్జెట్‌లో గణాంకాలు ఉంటే దాన్ని ఆసరాగా తీసు కుని ప్రభుత్వాన్ని నిలదీయడానికి సిద్ధమవుతున్నాయి. జూలై 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ విధానాన్ని అమల్లోకి తేవాలని కేంద్రం భావిస్తున్నందున సెంట్రల్ జీఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ వంటి 24 కొత్త బిల్లుల్ని ఈ సమావేశంలో ప్రవేశపెట్టి ఆమోదం పొందడం ప్రభుత్వానికి అనివార్యం కానుంది. 

ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి బడ్జెట్‌లోని అంశాలను, ముఖ్యంగా వృద్ధిరేటు, బడ్జెట్‌లోటు, పెద్దనోట్ల రద్దు నిర్ణయం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థపైన పడిన ప్రభావం తదితరాలను ఈ సమావేశాల్లో ప్రస్తావిం చాలని కాంగ్రెస్, వామపక్షాలు సహా పలు విపక్ష పార్టీలు సిద్ధమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: