తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై ప్రతీ తమిళుడులో ఏదో ఒక మూల అనుమానం ఉంది. కొంత మందైతే బహిరంగంగానే.. ఆమె మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. జయలలిత బుగ్గలపై రంధ్రాలు మొదలు, ఆమె కాళ్ల నుంచి తొలగించిన మాంసం వరకు ప్రతీ అంశంలోనూ ఎన్నో సందేహాలున్నాయి. అసలు జయలలితకు ఎలాంటి వైద్యం అందించారు..? ఏ జబ్బుతో ఆమె చనిపోయారు వంటి కారణలు తెలిసిన వారు కేవలం వైద్యులు, జయలలిత నెచ్చెలి శశికళ  మాత్రమే. 


జయలలిత మరణంపై తలెత్తిన సందేహాలను ఆమెకు వైద్యం చేసిన లండన్ డాక్టర్ రిచర్డ్ బీలే నివృత్తి చేశారు. చెన్నై అపోలో వైద్యులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. జయలలితకు అత్యుత్తమ వైద్యం అందించామని తెలిపారు. విషమ పరిస్థితుల్లో జయలలితను ఆస్పత్రికి తీసుకొచ్చారని రిచర్డ్ వెల్లడించారు. ఆమెను ఆస్పత్రికి తీసుకొచ్చేటప్పటికీ ఇన్ఫెక్షన్ పూర్తిగా సోకిందని చెప్పారు. ఇన్ఫెక్షన్ తో జయలలిత శరీరంలోని అవయావాలన్నీ దెబ్బతిన్నాయని వివరించారు. అప్పటికే ఆమెకు మధుమేహం ఎక్కువగా ఉందన్నారు. ఉప ఎన్నికల సమయంలో ఈసీ నిబంధనలను ఆమెకు చదివి వినిపించామని, అన్ని విన్నాకే బీఫామ్ లపై జయ సంతకాలు చేశారని రిచర్డ్ చెప్పారు.


ఆస్పత్రికి వచ్చిన మొదట్లో ఆమె నిస్సత్తువుగా ఉన్నారని రిచర్డ్ బీలే చెప్పారు. మొదట్లో ఎవరితోనూ మాట్లాడలేక పోయారని,  కొద్దిరోజుల తర్వాత పరిస్థితి మెరుగవడంతో స్పృహలోకి వచ్చారని వివరించారు. అధిక రక్తపోటు, మధుమేహం ఆమెను మరణానికి చేరువ చేశాయన్నారు. జయలలితకు హఠాత్తుగా గుండెపోటు వచ్చిందని, అందువల్లే ఆమె మరణించారని చెప్పారు. రోగులు ఉంటున్న గదుల్లో సీసీటీవీ కెమెరాలు లేవని, ఒకవేళ సీసీటీవీ కెమెరాలు ఉన్నా వీడియోలు విడుదల చేయబోమని అపోలో వైద్య వర్గాలు స్పష్టం చేశాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: