మంగళవారం మెరీనా బీచ్ లో హైడ్రామాకు తెరతీసిన పన్నీరు సెల్వంకు చిన్నమ్మ ఊహించని షాక్ ఇచ్చింది. అమ్మ జయలలిత తనను నిజాలు చెప్పమందంటూ పన్నీరు సెల్వం మీడియాకు చెప్పిన వెంటనే శశికళ అలర్ట్ అయ్యారు. పోయెస్ గార్డెన్ లో ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. పన్నీరు సెల్వం ను పార్టీ కోశాధికారి పదవి నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఓపిఎస్ స్థానంలో శ్రీనివాసన్ ను నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో పన్నీరు సెల్వంను పార్టీనుంచి బహిష్కరించే ధైర్యం చేయలేకపోయింది చిన్నమ్మ. ఒకవేళ పన్నీర్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లైతే అతని ఇమేజ్‌ మరింత పెరుగుతుందనే భావనతోనే చిన్నమ్మ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది.


పన్నీరు సెల్వంపై వేటుతో అన్నాడీఎంకేలో చీలక మొదలైంది. ప్రజల మద్దతు ఉన్న వ్యక్తి మాత్రమే పార్టీని నడిపించలన్నది జయ నిర్ణయమని, కానీ ప్రస్తుతం పార్టీలో అందుకు భిన్న పరిస్థితులున్నాయని పన్నీరు సెల్వం ప్రకటించడం ఇప్పుడు దుమారం రేపుతోంది. మొన్నటి వరకు అత్యంత విశ్వాసపాత్రుడిగా, అసలు నోరు విప్పని పన్నీర్ సెల్వం.. ఒక్కసారిగా తిరుగుబాటు చేశారు. తానేంటో కొన్ని గంటల్లోనే చూపిస్తానని సవాలు చేశారు. ఇప్పటివరకు తాను నోరు విప్పింది కేవలం పది శాతమేనని, ఇంకా 90 శాతం మిగిలే ఉందని అన్నారు. అవన్నీ తనతో చెప్పించే ప్రయత్నం చేయొద్దని అవతలి పక్షాన్ని అంటే శశికళను ఉద్దేశించి హెచ్చరించారు. 
 
తనను పార్టీ పదవి నుంచి తప్పించడంపై పన్నీరు సెల్వం స్పందించారు. తాను ప్రతిపక్షాలతో కుమ్మక్కయ్యానని శశికళ వర్గం ఆరోపించడం సహజమేనని అన్నారు. తిరుగుబాటు చేసినప్పుడు ఎవరిమీదైనా ఇలాగే బురద చల్లుతారన్నారు. శశికళకు ఇంత అర్జంటుగా ముఖ్యమంత్రి అయిపోవాలని ఎందుకు అనిపిస్తోందని, తమిళనాడులో పరిస్థితులను ఆమె అర్థం చేసుకున్నట్లు లేరని అభిప్రాయపడ్డారు. తాను ప్రతిరోజూ అపోలో ఆస్పత్రికి వెళ్లానని, కానీ అమ్మను ఆస్పత్రిలో ఒక్కసారి కూడా చూసే అవకాశం తనకు రాలేదని, అమ్మను ఆస్పత్రిలో చూడలేని దురదృష్టవంతుడినని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నాడీఎంకే పార్టీకి, జయలలితకు నిజమైన విశ్వాసపాత్రుడిని తానేనని పన్నీర్ సెల్వం చెప్పారు. షీలా బాలకృష్ణన్ రాజీనామా గురించి ఇప్పుడేమీ చెప్పలేనని, ఆమెకు ఇప్పటికే ఎక్స్‌టెన్షన్ ఇచ్చామని అన్నారు. తమిళనాడులో ఇప్పుడు జరుగుతున్న ప్రతి పరిణామం వెనుక ఒక శక్తి ఉందని చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: