అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు రోజులు దగ్గర పడ్డాయా..? త్వరలోనే ఆయన అధ్యక్ష పీఠం నుంచి దిగిపోతారా..? అంటే ప్రస్తుత పరిస్థితులు అవుననే సమాధానమే చెబుతున్నాయి. ఒక్క అమెరికాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ విశ్లేషకులు సైతం ఇదే మాట చెబుతున్నారు. ట్రంప్ ను వీలైనంత త్వరగా వదిలించుకునేందుకు రిపబ్లికన్ పార్టీ కూడా వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తోంది.


ట్రంప్ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత రెండు వారాల్లోనే తన నిర్ణయాలతో యావత్ ప్రపంచం చేత గగ్గోలు పెట్టించారు. ఆయన తీరుపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. దీంతో ట్రంప్ పై విశ్వాసం కోల్పోయిన ప్రజలు ఆయనను అధ్యక్ష పదవి నుంచి దింపడమే మంచిదని అభిప్రాయ పడుతున్నట్టు తాజా సర్వేలో తేలింది. దేశంలోని మూడొంతుల మంది ప్రజలు ట్రంప్ ను అధ్యక్ష పదవి నుంచి దించాలని కోరుకుంటున్నట్టు సర్వే వెల్లడించింది.


మరోవైపు సొంత పార్టీలోనూ ట్రంప్ కు వ్యతిరేక గాలులు వీస్తున్నాయి. పార్టీలోని మెజారిటీ నేతలు ట్రంప్ ను ఎక్కువ కాలం కొనసాగించడం మంచిది కాదని భావిస్తున్నారు. ఆయనను బలవంతంగా సాగనంపేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం. ఏడాదిన్నరలోపే ట్రంప్ ను అభిశంసన ద్వారా.. లేకుంటే 25వ రాజ్యాగం సవరణను ప్రయోగించడం ద్వారా గద్దె దింపాలని ప్లాన్ చేస్తున్నారు. ట్రంప్ స్థానంలో  వైస్ ప్రెసిడెంట్ మెక్ పెన్స్ ను అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టాలని దాదాపు నిర్ణయానికి వచ్చేశారట.


ప్రస్తుతం అమెరికాలో ఎక్కడ చూసినా.. ట్రంప్ అధ్యక్ష పదవిపైనే చర్చ జరుగుతోంది. ట్రంప్ తమకు భారంగా మారినట్టు రిపబ్లికన్లు ఎప్పుడు తెలుసుకుంటారనేదే ప్రస్తుత ప్రశ్న అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి అధ్యక్ష పీఠంపై ట్రంప్ కూర్చోవడం దినదిన గండమే.


మరింత సమాచారం తెలుసుకోండి: