తెలంగాణ కాంగ్రెస్ నేతలకు తత్వం బోధపడిందా ? తమలో తాము కలహించుకుంటే  ... కలలు గంటలున్న  అధికారం కలగానే మారుతుందని నిర్ధారణకు వచ్చారా ? అందరూ ఒకే తాటిపైకి రావాలని నిర్ణయించుకున్నారా ? ఇందుకోసం  పీసీసీ అధ్యక్షుడు  ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి  చేపట్టిన కార్యచరణ ఫలితాలనిస్తోందా ?  

 

కలసి ఉంటేనే.. కలదు అధికారమని తెలంగాణ కాంగ్రెస్ నేతలు గ్రహించినట్లున్నారు. 2019 ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే కలహాలు వీడి.. కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. ఎవరికి వారుగా కాకుండా అంతా కలిసి ఐకమత్యంగా ఉండి ..విభేదాలను పక్కన పెట్టి పోరాడితేనే ..అధికార టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోగలుగుతామని తెలుసుకున్నారు. ఇప్పటి వరకు ఉన్న గ్రూప్ తగాదాలను పక్కన బెడితే తిరుగుండదని భావించిన పీసీసీ చీఫ్‌ నేతలను ఏకం చేసేందుకు సిద్ధమయ్యారు. సొంత జిల్లా నుంచే కార్యచరణ మొదలుపెట్టిన ఆయన.. తనను రాజకీయ శత్రువుగా  భావించే కోమటిరెడ్డి వెంకట రెడ్డికి స్నేహ హస్తం అందించారు. శాసనసభ పక్ష నేత జానారెడ్డితో కలిసి స్వయంగా కోమటిరెడ్డి ఇంటికి వెళ్లి భోజనం చేసి కలిసి నడుద్దామంటూ పిలుపునిచ్చారు. ఇందుకు కోమటిరెడ్డి కూడా అంగీకరించడంతో తొలి అడుగులోనే విజయం సాధించారు. ఇదే సమయంలో ఐదేళ్లుగా గాంధీ భవన్‌కు రాని కోమటిరెడ్డి ... గాంధీభవన్‌లో అడుగు పెట్టడం  అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

 

ఇదే సమయంలో మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కి ఉత్తమ్ కుమార్ రెడ్డితో  వైరాగ్యం ఉంది. రెండు సంవత్సరాలైన  పీసీసీగా కొనసాగకముందే తన పదవి ఎగురేసుకుపోయాడని పొన్నాల  ఉత్తమ్ పై గుర్రుగా ఉన్నారు. దీనిపై కూడా సయోధ్య ప్రయత్నించిన ఉత్తమ్‌ ... కోమటి రెడ్డి ఇంటికి తరహాలోనే పొన్నాల ఇంటికి కూడా భోజనానికి వెళ్లి అప్యాయంగా పలకరించి పార్టీ కోసం కలిసి నడుద్దామంటూ కోరాడు. దీనికి స్పందించిన పొన్నాల మరుసటి రోజే  ఉత్తమ్ ఇంటికి వెళ్లి  దోస్త్ మేరా దోస్త్ అంటూ స్నేహహస్తం చాచాడు.

 

ఇక మాజీ  కేంద్రమంత్రిగా పనిచేసిన సర్వేసత్యనారాయణ,  సీనియర్ నేత వీహెచ్‌తో పాటు  పార్టీలోని సీనియర్ నేతలకు ప్రతి కార్యక్రమాలకు సంబంధించిన విషయాలు తెలియజేస్తూ వారిసలహాలను, సూచనలను తీసుకోవడంతో పాటు ఫాలో అవుతున్నాడు. దీంతో పార్టీలో సమిష్టి నిర్ణయాలు ప్రాధాన్యత లభిస్తోందంటూ కేడర్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 

ఇప్పటి వరకు పెద్ద నాయకుల మధ్య విభేదాలపై దృష్టి సారించిన ఉత్తమ్ ఇకపై జిల్లాల వారిగా నేతల మధ్య విభేదాలను పరిష్కరించే పనిలో పడ్డారు. గ్రూప్ తగాదాలపై ఇప్పటికే ప్రత్యేక జాబితా రూపొందించిన ఆయన ... కలిసుంటే వచ్చేది అధికారం ... లేకుంటే కలహాల కాపురం అంటూ హితభోద చేస్తున్నారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: