తెలంగాణలో టిడిపి ఉనికిపై దెబ్బకొట్టే ప్రయత్నం జరుగుతోందా..?  ఓవైపు ఆ పార్టీ నేతలు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తుంటే..మరోవైపు 2019 ఎన్నికల్లో గులాబి, పసుపు జెండాలు కలయికలో పోటీకి ముందుకెళ్ళనున్నాయన్న సంకేతాల అర్థమేంటి..?  తెలుగు తమ్ముళ్ళలో కొత్తగా నెలకొన్న ఈ అంతర్మథానికి తెరదించేందుకు ప్రయత్నిస్తున్నారు టి-టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.  టిఆర్ఎస్ జతకట్టడమంటే...ఐఎస్ఐ ఉగ్రవాదులతో జతకట్టడమే అంటూ తీవ్ర ఆరోపణలు  చేశారు


పార్టీ సీనియర్ నేతల ఫిరాయింపు రాజకీయాలతో ఉక్కిరి బిక్కిరి అయిన తెలంగాణ టీడీపీ..ఇటీవలే తిరిగి మళ్ళీ పట్టాలెక్కేందుకు ప్రయత్నిస్తోంది.  తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న రైతు సమస్యలు, విద్యార్థి ఫీజు రీఎంబర్స్ మెంట్ వంటి అంశాల్లో  టీటీడీపీ తన ఉద్యమాలతో ప్రభుత్వాన్ని నిలదీసింది. తెలంగాణలో కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం పెంచటంలోనూ ఈ ఆందోళనలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాల్లో రైతు పోరుయాత్ర నిర్వహించిన టి-టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి..తాజాగా ప్రజా పోరు పేరుతో మంత్రుల నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు.

 

తెలంగాణ జిల్లాలో టీడీపీ చేపట్టనున్న ఈ బహిరంగ సభల ద్వారా, టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు. ఎన్నికల సమయంలో  ప్రజలకు ఇచ్చిన హామీలనై  ఇంటికో ఉద్యోగం, విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్ మెంట్, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు, రైతులకు ఇన్ పుట్ సబ్సిడి,  పేదలకు డబుల్ బెడ్ రూం ఇల్లు, దళితులు, గిరిజనులకు మూడు ఎకరాల భూమి లాంటి హామీల్లో ప్రభుత్వం సాధించిన పురోగతిపై ప్రజాల సమక్షంలో నిలదీయాలన్నది టి-టిడిపి వ్యూహాత్మక ఆలోచనగా కనిపిస్తోంది

 

మరో రెండు రోజుల్లో ఈ ప్రజా పోరు యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో..టి-టిడిపి ఉలిక్కిపడేలా ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది.   2019 ఎన్నికల్లో టిఆర్ఎస్ తో టిడిపి పొత్తు పెట్టుకోనున్నట్లుగా వార్తలు గుప్పుమన్నాయి. దీంతో ఇప్పటి వరకు ప్రభుత్వ ప్రజా వైఫల్యాలపై పోరాటం చేస్తున్న తెలుగు తమ్ముళ్లకు షాక్ తగిలినంత పనైంది. ఈ విషయంపై సీరియస్ గా స్పందించిన టి-టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి..టీఆర్ ఎస్ పై  తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవటమంటే, ఐఎస్ఐ ఉగ్రవాదులతో పొత్తు పెట్టుకోవటమేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టిడిపికి ప్రధాన శత్రువు టిఆర్ఎస్ పార్టీనేనని, ఆ పార్టీని గద్దెదింపేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేసారు

 

తెలుగుదేశం పార్టీ బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవ వేదికని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. పొత్తు విషయంలో టిఆర్ఎస్ తో, టిడిపి కలిసి ముందుకెళ్తుందన్న దుష్ప్రచారాలను నమ్మొద్దంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: