ఇప్పుడు అన్నింటికి ఆధారే ఆధారం. అది కేవలం గుర్తింపు కార్డు మాత్రమే కాదు. అది ఓ యునిక్‌ ఐడీ. బ్యాంక్‌ లావాదేవీలు, ఇతరత్రా సదుపాయాలన్నింటికి ఆధార్‌ కార్డు తప్పనిసరి. అది లేక పోతే ఏదీ పొందే ఛాన్స్‌ లేదు. ఇకపై దీన్ని ప్రజా పంపిణీ వ్యవస్థలోనూ తప్పనిసరి చేయనుంది కేంద్ర ప్రభుత్వం. అందుకు సంబంధించి విధి విధానాలను కూడా ప్రకటించింది.

 

ఆధార్‌ లేక పోతే మీరు వెంటనే అప్లై చేయండి. ఎంత త్వరగా వీలైతే అంత ఫాస్ట్‌ గా ఆధార్‌ తీసుకునేందుకు ప్రయత్నించండి. ఇప్పటికే అన్ని సేవలకు ఆధార్‌ కార్డును తప్పనిసరిగా జత చేయమని సూచిస్తున్నారు అధికారులు. అది లేకపోతే ఎలాంటి అప్లికేషన్స్‌ కానీ, ప్రభుత్వ పరంగా ఇతరత్ర సేవలను కానీ అందించడానికి అంగీకరించడం లేదు అధికారులు.

 

ఇప్పుడు ఇదే విధానాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థలోనూ అమలు చేసేందుకు సిద్ధమై పోయింది కేంద్ర సర్కార్‌. ఈ విధానం గనక అమలులోకి వస్తే రేషన్‌ దుకాణాల్లో రాయితీ సరుకులు తెచ్చుకోవాలన్నా ఆధార్‌ కార్డు ఉండాల్సిందే. ఈ మేరకు నోటిఫికేషన్‌ ను కూడా జారీ చేసింది ప్రభుత్వం. ఇప్పటి వరకు ఆధార్‌ కార్డును పొందని వారు ఈ ఏడాది జూన్‌ 30 వరకు పొందాలని సూచించింది. ఆ తర్వాత ఆధార్‌ లేక పోతే ఎవరికీ రాయితీలో సరుకులు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.

 

ఒకవేళ ఇప్పటికే ఆధార్‌ కార్డుకు అప్లై చేసినా.. రాకపోతే.. దరఖాస్తు ప్రతినీ ఇతర గుర్తింపు కార్డులను చూపడం ద్వారా రాయితీ సరుకులను పొందే వెసులుబాటు ఇచ్చారు. ఆహార రాయితీ, నగదు బదిలీ కోసం లబ్ధిదారుల ఆధార్‌ సంఖ్యను రేషన్‌ కార్డు లేదా బ్యాంకు ఖాతాతో అనుసంధానించాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. రేషన్‌ కార్డులతో ఆధార్‌ అనుసంధానం విషయంలో  పలుమార్లు అవకాశాలు పొడిగించినా.. రాష్ట్రాలు తమకేం పట్టనట్లు వ్యవహరించడంతోనూ నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు.


ఆహార భద్రత చట్టం గత ఏడాది నవంబర్‌ నుంచి అమలులోకి వచ్చింది. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా దాదాపు 80 కోట్ల మందికి ఈ పథకం ద్వారా సరుకులను పంపిణీ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. దేశవ్యాప్తంగా సుమారు 23 కోట్ల రేషన్‌ కార్డులుండగా  5లక్షల 27 వేల రేషన్‌ దుకాణాల ద్వారా రాయితీ సరుకులను అందజేస్తున్నారు. అందులో ఒక్కో వ్యక్తికి 5కిలోల ఆహార ధాన్యాన్ని కేవలం రూ. 1 నుంచి రూ. 3 లకే అందింస్తోంది ప్రభుత్వం. ఇందులో గ్రామీణులు 75శాతం ఉండగా, పట్టణ ప్రాంతాల్లోని వారు 50 శాతం వరకు ఉన్నారు. వీటిలో కేవలం 16 కోట్ల 62లక్షల రేషన్‌ కార్డులు మాత్రమే ఆధార్‌ తో అనుసంధానం అయ్యాయి.

 

ప్రజా పంపిణీ వ్యవస్థలో వందశాతం డిజిటలీకరణ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని ముందుకు తెచ్చింది. దీన్ని సమర్ధవంతంగా అమలు చేస్తే రాయితీ సరుకులు పక్కదారి పట్టే ఛాన్స్‌ ఉండదని భావిస్తోంది కేంద్రం. ఒకవేళ మీరూ ఆధార్‌ పొందక పోతే వీలైనంత త్వరగా తీసుకోండి.


మరింత సమాచారం తెలుసుకోండి: