తమిళ రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠను కలిగిస్తున్నాయి. గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ...అధికార పీఠం దక్కేలా శశికళా, పన్నీరు వర్గాలు వ్యూహాలు రచిస్తున్నాయి. ధర్మమే గెలుస్తుదంటూ చెప్పిన పన్నీరు సెల్వం  తన వ్యూహాలకు మరింత పదును పెట్టారు. త్వరలోనే  శుభవార్త వింటారంటూ చెప్పి అభిమానులకు సంబరం కలిగించారు. పన్నీరు సెల్వం కవ్వింపు చర్యలకు దిగుతున్నా  ... ఎమ్మెల్యేలు తన దగ్గర ఉన్నంత వరకు తనకు ఎలాంటి ఢోకా లేదని శశికళ భావిస్తున్నారు. జయ సెంటిమెంట్‌ను ప్రయోగిస్తూ..ఎమ్మెల్యేలను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు

 

 తమిళ రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠను కలిగిస్తున్నాయి. అధికార పీఠం దక్కించుకునేందుకు అన్నా డీఎంకే పార్టీలో శశికళ, పన్నీరు సెల్వం గ్రూపులుగా చీలడంతో ఎవరి పక్షాన ఎంతమంది ఉన్నారో  ఊహించని పరిస్థితి తలెత్తింది. మొత్తం 234 మంది సభ్యులుగల తమిళనాడు అసెంబ్లీలో.. జయలలిత మరణంతో  సభ్యుల సంఖ్య 233కు చేరింది. ఈ సమయంలో 117 మేజిక్ ఫిగర్ ను  పన్నీరు సెల్వం ఈజీగానే చేరుకునే అవకాశం ఉంది. శాశనసభలో అన్నా డీఎంకేకు 135 మంది సభ్యులు ఉండగా ..డీఎంకేకు 90 మంది, కాంగ్రెస్‌కు 8 మంది సభ్యులున్నారు.  తాజా అంచనాల ప్రకారం పన్నీరు సెల్వంకు బహిరంగంగా ఐదుగురు సభ్యులు మద్ధతు ప్రకటించగా మరో 20 మంది సిద్ధంగా  ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. గవర్నర్ విద్యాసాగర్ రావు బలనిరూపణ కోసం మొదట పన్నీరు సెల్వంను ఆదేశిస్తే ...  ఈజీగా మేజిక్ ఫిగర్ చేరుకునే అవకాశముంది. తనతో ఉన్న 26 మంది అన్నా డీఎంకే సభ్యులతో పాటు డీఎంకే, కాంగ్రెస్‌ మద్ధతుతో 124 ఓట్లు సాధించే అవకాశాలున్నాయి. దీంతో అధికార పీఠం పన్నీరు కైవసం చేసుకునే అవకాశముంది.

 

శశికళను బలం నిరూపించుకోమని కోరిన పక్షంలో  పన్నీరు సెల్వం తన వర్గం ఎమ్మెల్యేలతో చిన్నమ్మకు వ్యతిరేకంగా ఓటు వేయించే అవకాశాలున్నాయి. ఇదే సమయంలో ప్రతిపక్ష డీఎంకే, కాంగ్రెస్‌లు వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశముంది.  ఇదే జరిగితే శశికళకు అనుకూలంగా 109  వ్యతిరేకంగా 124 ఓట్లు రావచ్చు. అయితే ఓటింగ్‌కు ముందు స్పీకర్ ధనపాల్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.  పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న తరహాలో పన్నీరు సెల్వంకు మద్ధతిస్తున్న సభ్యులను సస్పెండ్ చేస్తే శశికళ తేలిగ్గా విజయం సాధించగలుగుతుంది. ఒక వేళ పన్నీరు సెల్వం వైపు మొగ్గు చూపితే  ఆయన విజయం  నల్లేరుపై నడకే

 

ఆపధర్మముఖ్యమంత్రిగా అధికార వ్యవస్ధలను ఉపయోగించుకుంటూ శశికళపై ముప్పేట దాడికి దిగుతున్నారు పన్నీర్ సెల్వం. చిన్నమ్మ దాచి ఉంచిన ఎమ్మెల్యేలు ఎక్కడున్నారో గుర్తించి విడిపించుకు రావాలంటూ డీజీపీకీ  ఆదేశాలు జారీ చేశారు. మరో వైపు  మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పన్నీరు సెల్వం మద్ధతుదార్లు ..శశికళ ఎప్పటికీ సీఎం కాలేరంటూ ప్రకటించారు.  జయలలిత నివసించిన పోయేస్‌ గార్డెన్ నుంచి త్వరలోనే శశికళను వెళ్లగొడతామంటూ ప్రకటించారు.

 

మరోవైపు పన్నీరు సెల్వం కవ్వింపు చర్యలకు దిగుతున్నా  ... ఎమ్మెల్యేలు తన దగ్గర ఉన్నంత వరకు తనకు ఎలాంటి ఢోకా లేదని శశికళ భావిస్తున్నారు. ఇందు కోసం ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో పడ్డారు శశికళ. సామ,బేధ, దండోపాయాలతో  ఎమ్మెల్యేలను ఆపడం సాధ్యం కాదని గ్రహించిన శశికళ .. జయ సెంటిమెంట్‌ను ప్రయోగిస్తున్నారు. తన ఆధీనంలో ఉన్న ఎమ్మెల్యేలతో వీడియా కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఆమె  ... అమ్మ ఆశయాలు నెరవేరేందుకు అంతా ఒకతాటిపై నడవాలంటూ పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు తనను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నా  .... గవర్నర్ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించకపోవడంపై గుర్రుగా ఉన్న శశికళ..పరిస్ధితి ఇలాగే కొనసాగితే తనకు మద్ధతిస్తున్న ఎమ్మెల్యేలతో రాష్ట్రపతి ఎదుట పెరేడ్ నిర్వహించాలని భావిస్తున్నారు. 

 

శశికళ, పన్నీరు సెల్వం ఎపిసోడ్ కొనసాగుతుండగానే తమిళనాడు ప్రతిపక్ష నేత స్టాలిన్ గవర్నర్‌ను కలిసారు. రాష్ట్రంలోని పరిస్ధితులను వివరించిన ఆయన ..త్వరలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరారు. ఎమ్మెల్యేలు అందుబాటులో లేకపోవడంతో .. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని  తక్షణమే పరిస్ధితులను చక్కదిద్దాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. మరోవైపు శశికళ, పన్నీరు సెల్వంల  మధ్య రాజకీయ పోరు ముదిరితే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేసే అవకాశముంది. ఈ నేపధ్యంలోనే సూపర్ స్టార్ రజనీ కాంత్ కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నారని సమాచారం. సూపర్ స్టార్ వెనక బీజేపీ నేతలే ఉన్నారంటూ మరో ప్రచారం జరుగుతుంది. అయితే పార్టీ ఏర్పాటు ప్రచారాన్ని సూపర్ స్టార్ సన్నిహితులు కొట్టిపారేస్తున్నారు. ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలు రజనీకాంత్‌కు లేవంటున్నారు. 

 

తమిళనాడు రాజకీయాల్లో నెలకున్న తాజా పరిస్థితులపై గవర్నర్ విద్యాసాగర్ రావు..ఎంటువంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వాత్రా ఉత్కంఠగా మారింది. 

 


మరింత సమాచారం తెలుసుకోండి: