తెలంగాణలో ప్రజా వ్యతిరేక విధానాలపై మరోసారి ప్రజా పోరాటానికి సిద్దమౌతున్నారు తెలంగాణ టీడీపీ నేతలు. నేటి నుంచి ప్రజాపోరుతో.. మంత్రుల నియోజకవర్గాల్లో బహిరంగ సభలను నిర్వహించనున్నారు. ఈనెల 11న కొల్లాపూర్, 15న గజ్వేల్, 20న నిర్మల్ లో బహిరంగ సభలను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ వేదికల ద్వారా టిఆర్ఎస్ వైఖరిని ప్రజల్లో ఎండగట్టాలని కంకణం కట్టుకున్నారు టి-టీడీపీ నాయుకులు

 

తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు జోర్‌  పెంచారు. ప్రజాసమస్యలపై గళం విప్పేందుకు.. ప్రజాపోరు యాత్ర  పేరుతో  మంత్రుల నియోజకవర్గాల్లో బహిరంగ సభలను నిర్వహించేందుకు సిద్ధమౌతున్నారు. ఇప్పటికే ఫీజు రీఎంబర్స్ మెంట్,  రైతు పోరుయాత్ర,  విద్యార్థి గర్జనలతో ఆందోళనలు చేపట్టిన టి-టిడిపి,  ఈ అంశాలపై అటు అసెంబ్లీలోని ప్రభుత్వాన్ని నిలదీసింది. అయితే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం, ప్రతిపక్షాలకు సరైన అవకాశాలు కల్పించకపోవటంతో పాటు, తాము ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో వైఫల్యం చెందటంతో మరో ఆందోళనకు సిద్దమయ్యారు.  టిఆర్ఎస్  వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని నిర్ణయించుకున్న  టీ-టిడిపి..ఈనెల 11న కొల్లాపూర్, 15న గజ్వేల్, 20న నిర్మల్ లో భారీ బహిరంగ సభలను నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తుంది.

 

టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై లక్షల మందికి డబుల్ బెడ్ రూం ఇళ్ళను నిర్మిస్తామని హామీ యిచ్చిందని..అయితే ఆ హామీ నెరవేర్చడంలో  మాట తప్పారని టి-టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం వెయ్యి ఇళ్ళ నిర్మాణం మాత్రమే పూర్తయిందని అంటున్నారు. దళిత, గిరిజనలకు మూడు ఎకరాల భూ పంపిణిలోనూ టిఆర్ఎస్ సర్కార్ విఫలమైందని మండిపడ్తున్నారు.  ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కూడా ప్రాజెక్టులను రీ డిజైనింగ్ చేసి, వేల కోట్లు దోచుకునే కార్యక్రమం చేపట్టిందని టి-టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.

 

ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల విషయంలోనూ...దళిత, గిరిజనలకు మూడెకరాల భూ పంపిణి విషయంలో టిఆర్ఎస్ సర్కార్ విధానాన్ని తప్పు పట్టారు టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య.  బహిరంగ సభల ద్వారా ప్రజా క్షేత్రంలోనే, టిఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడతామంటున్నారు. మొత్తం మీద తెలంగాణలో ఎనిమిది లక్షల మంది సభ్యత్వ నమోదుతో జోష్ మీద వున్న టి-టిడిపి, ప్రజాపోరు యాత్ర ద్వారా మరోసారి ప్రజల్లో పార్టీపై నమ్మకాన్ని పెంచుకోవాలని చూస్తోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: