జయలలిత మరణం తరువాత ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన పన్నీరు సెల్వం.. తదనంతర రాజకీయ పరిణామాలకు తలవొంచారు. అమ్మ స్థానంలో చిన్నమ్మను కూర్చోబెట్టేందుకు ఈనెల 5న తన పదవికి రాజీనామా చేశారు. అలాగే శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. వ్యక్తిగత కారాణాలతోనే సీఎం పదవికి రాజీనామా చేస్తున్నానని, ఆమోదించాల్సిందిగా కోరుతూ గవర్నర్ విద్యాసాగర్ రావు లేఖ పంపారు. 


ముఖ్యమంత్రి పదవికి పన్నీరు సెల్వం చేసిన రాజీనామాను ఆ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌ రావు ఆమోదించారు. తదుపరి ఏర్పాట్లు చేసేంత వరకు పదవిలో కొనసాగాల్సిందిగా పన్నీరు సెల్వంను కోరారు. ఈనెల 7 తేదీన రాజ్‌భవన్ నుంచి ఈ  మేరకు ప్రకటన వచ్చింది. అప్పట్నుంచి పన్నీరు సెల్వం ఆపధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.


తదనంతర పరిణామాలతో పన్నీరు సెల్వం.. శశికళకు వ్యతిరేకంగా స్వరం మార్చారు. తనపై ఒత్తిడి తెచ్చి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయించారంటూ చిన్నమ్మపై ఆరోపణలు చేశారు. అలాగే ఇరువురు నేతలు ముఖ్యమంత్రి అయ్యేందుక పోటాపోటీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతీ అంశాన్ని గవర్నర్ విద్యాసాగార్ రావు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రాజీనామా విషయంలో పన్నీరు సెల్వం ఆరోపణలు చేయడంతో.. ఆ దిశగా రాజ్ భవన్ వర్గాలు దృష్టి సారించాయి. 


ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తూ.. పన్నీర్ సెల్వం పంపిన లేఖలోని సంతకంపై రాజ్‌భవన్ వర్గాలు అనుమానం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఏ ముఖ్యమంత్రైనా రాజీనామా లేఖను గవర్నర్‌ను కలిసి నేరుగా అందజేయాల్సి ఉంటుంది. పన్నీరు సెల్వం రాజీనామా చేసే సమయానికి.. గవర్నర్ ముంబైలో ఉండడంతో ఫ్యాక్స్ ద్వారా ఆ లేఖను పంపారు. ఆ తర్వాత సీల్డ్ కవర్‌లో రాజ్‌భవన్ అధికారులకు అందజేశారు. 


ఈనెల 9న గవర్నర్ విద్యాసాగర్‌రావు చెన్నై వచ్చిన తరువాత పన్నీరు సెల్వం రాజీనామా లేఖను పరిశీలించారు. అందులో పన్నీర్ సెల్వం సంతకం చూసి అది ఆయనదా? కాదా? పరిశీలించాలంటూ అధికారులను గవర్నర్ ఆదేశించారు. పరిశీలించిన అధికారులు సంతకంలో తేడాలు ఉన్నట్టు గుర్తించారు. నిజానికి సెల్వం తన సంతకం వద్ద తేదీలను, సమయాన్ని రాయరు. కానీ రాజీనామా లేఖలో అవి ఉన్నాయి. అంతేకాదు తమ వద్ద ఉన్న రికార్డుల్లోని సంతకాలతో రాజీనామా లేఖలోని సంతకాన్ని పోల్చినప్పుడు ఈ తేడాలు బయటపడినట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: