తమిళనాడు రాజకీయాలు నరాలు తెగే ఉత్కంఠకు కేరాఫ్ అడ్రస్ గా మారాయి. శశికళ, పన్నీర్ మధ్య పోరు పతాక స్థాయికి చేరింది. అమ్మ బ్రతికి ఉన్న సమయంలో శశికళ తనను తీవ్రస్థాయిలో వేధించే వారని.. అయితే అమ్మ సపోర్ట్ తో తాను నిలబడ్డానని శశికళపై ఫైర్ అయ్యారు పన్నీర్ సెల్వం.. అటు ఎమ్మెల్యేలతో సమావేశమైన శశికళ.. అమ్మను తల్చుకుంటూ కంటతడిపెట్టారు. అయితే తనను సీఎం పదవి చేపట్టేందుకు గవర్నర్ ఆహ్వనించక పోవడంపై అసహనంగా ఉన్న శశికళ.. ఆమితూమి తేల్చుకునేందుకు సిద్ధమౌతున్నట్టు సమాచారం.

 

తమిళనాట రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠగా మారుతున్నాయి. శశికళ, పన్నీర్ సెల్వం  మధ్య ఆధిపత్య పోరు నువ్వా.. నేనా అన్నట్టుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలను తాను నిర్బంధించారంటూ పన్నీరు సెల్వం వర్గం చేస్తున్న ఆరోపణలకు శశికళ కౌంటర్ ఇచ్చారు. గోల్డెన్ బే రిసార్టులో ఉన్న ఎమ్మెల్యేలను ఆమె మీడియా ముందు ప్రవేశపెట్టారు. తన వెనుక ఎంత మంది ఉన్నారో  లెక్క పెట్టుకోండంటూ తన బలాన్ని  ప్రదర్శించారు. రిసార్ట్స్ లో ఎమ్మెల్యేలను నిర్బంధించలేదని, వారంతా వారి వారి  కుటుంబ సభ్యులతో నిత్యం సంభాషిస్తున్నట్లు శశికళ వివరణ ఇచ్చారు. అక్రమాస్తుల కేసులో కోర్టు తీర్పు రానివ్వండి.. తర్వాత మా అడుగేంటో మీకే తెలుస్తుందంటూ పన్నీరు సెల్వం వర్గానికి చిన్నమ్మ హెచ్చరికలు పంపారు.

 

అంతకు ముందు తనకు మద్ధతును అందిస్తున్న ఎమ్మెల్యేలతో సమావేశమైన శశికళ.. జయలలితను తలుచుకుని కంటతడి పెట్టారు. చిన్నమ్మ కంటతడి పెట్టడం చూసి ఎమ్మెల్యేలు సైతం దుఖ సాగరంలో మునిగిపోయారు. మీరంతా అండగా ఉంటే జయలలిత ఆశయాలు కొనసాగేలా చూస్తానని.. పార్టీని కాపాడుకోవడానికి జీవితాన్ని అర్పిస్తానని ఉద్వేగంగా శశికళ ప్రసంగించారు. శశికళ హెచ్చరికలపై స్పందించిన పన్నీర్ సెల్వం..అమ్మ బ్రతికి ఉన్న సమయంలోనూ శశికళ తనను ఎంతో వేధించే వారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే అమ్మ సపోర్ట్ తో వాటినన్నింటిన ఎదుర్కొన్నానని తెలిపారు. శశికళ ఆటలు ఇక సాగవని.. శశికళ వెనుక ఉన్న ఎమ్మెల్యేల్లో ఎక్కువగా రౌడీలే ఉన్నారంటూ దుయ్యబట్టారు.


అన్నా డీఎంకేలో వారం రోజులుగా  జరుగుతున్న  వ్యూహా, ప్రతివ్యూహాలతో ...శశికళ బలం క్రమ క్రమంగా తగ్గిపోతుంటే.. అదేస్థాయిలో పన్నీర్‌ సెల్వంకు మద్దతు  పెరుగుతోంది. శశికళ చుట్టూ దాదాపు 120 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నా.. వారిలో శశికళకు అండగా నిలిచే  నేతలు  ఎంత మేరకు ఉన్నారనే  అనుమానాలు నెలకొన్నాయి.  పన్నీర్ సెల్వంకు ప్రజల మద్దతు పెరుగుతోందని తెలుస్తుంటే శశికళ వర్గంలోని వారి మనసులో గుబులురేగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో శశికళ వర్గంలోనే ఉంటే  నష్టపోతామేమోనన్న అనుమానాలు ఆమెకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలో కలుగుతున్నాయని తమిళనాడు వ్యాప్తంగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు పన్నీర్‌ సెల్వంకు  మరో ముగ్గురు ఎంపీలు మద్దతు ప్రకటించారు. ఎంపీలు బి. సెంగుట్‌ వన్‌, జె.జయసింగ్‌, మరుతరాజాలు పన్నీర్‌ సెల్వం నివాసానికి వెళ్లి మద్దతు ప్రకటించారు. దీంతో ఆయన మద్దతు తెలిపిన ఎంపీల సంఖ్య ఏడుకు చేరింది.  తన మద్ధతు దారులను క్రమంగా పెంచుకుంటూ వెళ్తున్న  పన్నీర్ సెల్వం శశికళకు మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమౌతున్నారు. 

 

గోల్డెన్ బే రిసార్ట్ లో ఉన్న శశికళకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలను కలుసుకునేందుకు సిద్ధమౌతున్నారు. ఆపధర్మ ముఖ్యమంత్రిగా తన హోదాను ఉపయోగించి..ఎమ్మెల్యేలను కలిసి తనకు మద్దతు ఇవ్వాలని, తనకు అండగా నిలవాలని ఆయన కోరనున్నట్లు తెలుస్తోంది. ఆ రిసార్ట్ లో మొత్తం 120 మంది ఎమ్మెల్యేలు ఉండగా, అందులో 20 మంది ఎమ్మెల్యేలు చిన్నమ్మపై అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. దీంతో పన్నీరు సెల్వం ఈ నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు శశికళ శిబిరం నుంచి శనివారం ఐదుగురు మంత్రులు అదృశ్యం కావడం చర్చనీయాంశమైంది.

 

గోల్డెన్ బే రిసార్ట్ లో మీడియాతో మాట్లాడిన సమయంలో శశికళ ఎంపీలు అందరూ పన్నీర్ సెల్వం దగ్గరికి వెళ్తుంటే..ఆ కుట్ర వెనుక ఎవరో ఉన్నారో అర్ధమౌతుందంటూ కేంద్ర ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అటూ గవర్నర్ విద్యాసాగర్ రావు బలనిరూపణ కోసం ఇంకా ఆహ్వనించక పోవడంతో గుర్రుగా ఉన్న శశికళ నిరసనలకు సిద్ధమయ్యారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: