అంగారక గ్రహ అన్వేషణకు భారత్‌తో అమెరికా జతకట్టనుందా.. ? ఆ అపూరూపమైన ఘట్టానికి భారతీయ వ్యోమగామి నేతృత్వం వహించనున్నాడా? అంతటితోనే ఆగుతారా.. లేదంటో మరో గ్రహంపై రోవర్‌ను దించుతారా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. నిజంగా అదే జరిగితే అంగారకుడిపై భారత జెండా పాతడం ఖాయం. కానీ.. అదెప్పుడు? ఎప్పటిలోగా ఆ మిషన్‌ ప్రారంభమవుతుంది. 


చంద్రయాన్‌-1తో మామా అని ప్రేమగా పిలుచుకునే చంద్రుడి వైపు అడుగులు వేశాం. ఆ పరిశోధనను ఇంకాస్త ముందుకు తీసుకెళ్లేందుకు.. త్వరలోనే చంద్రయాన్‌-2 చేపట్టబోతున్నాం. అక్కడ దాగిన గుట్టుమట్లను విప్పబోతున్నాం. చంద్రుడు సరే... మరి సూర్యుడి చెంతకు చేరేదెప్పుడు... సౌరశక్తిపై అధ్యయనం చేసేదెప్పుడు... ఇదే ఇపుడు ఇండియన్స్‌లో ఆసక్తి రేపుతోంది. అయితే... ఆ టైమ్‌ కూడా వస్తోందని చెబుతోంది ఇస్రో. ప్రాణశక్తి ప్రదాత సమీపానికి త్వరలోనే చేరుకుంటామంటోంది. ఇందుకోసం ఆదిత్య-1 ప్రాజెక్టుకు సిద్ధం చేస్తున్నామని చెబుతోంది.


సౌర మండలంలో అంతుచిక్కని గ్రహంగా మిగిలిన అంగారకుడిపై అధ్యయనానికి ఇప్పటికే మంగళ్‌యాన్‌ను పంపిన ఇస్రో... ఇపుడు రెండోదశకు సిద్ధమవుతోంది. ఇందుకోసం 2021-22ని టైమ్‌ ఫ్రేమ్‌గా ఫిక్స్‌ చేసుకుంది. రెండోదశలో రోబోను రెడ్‌ ప్లానెట్‌పై దింపాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం అమెరికా అంతరిక్ష సంస్థ నాసాతో దోస్తానా చేస్తోంది. 


హాలీవుడ్‌లో తీసిన గ్రావిటీ సినిమాకంటే తక్కువ ఖర్చుతో మంగళ్‌యాన్-1 ప్రాజెక్టును పూర్తిచేసిన ఇస్రో సామర్థ్యాన్ని గుర్తించింది నాసా. తమతో పోలిస్తే పదో వంతు మాత్రమే ఖర్చు చేయడంతో అంగారక అన్వేషణలో కలిసి పనిచేద్దామని కబురందించింది. దీనికి ఇస్రో కూడా ఇంట్రెస్ట్‌ చూపించింది. దీంతో... ఇ్రసో, నాసా సంయుక్తంగా మార్స్ మిషన్‌ను చేపట్టాయి. ఇప్పటికే.. భూకంపాలూ, సునామీల వంటి ఉత్పాతాలను విశ్లేషించే రాడార్‌ను అభివృద్ధి చేసే పనిలో పడ్డాయి. ఇటు నాసాను మాత్రమే కాదు.. అటు ఫ్రాన్స్‌ను కూడా అట్రాక్ట్‌ చేసింది ఇస్రో. దీంతో౬ ఈ ప్రాజెక్ట్‌లో పాలు పంచుకునేందుకు ఫ్రాన్స్‌ కూడా ఉత్సుకత చూపిస్తోంది.


మంగళ్‌యాన్‌తో  గ్రహాంతర అంతరిక్ష ప్రయోగాలకు బీజం వేసిన ఇస్రో... ఇపుడు సౌర మండలంలోని మరో గ్రహంపై కన్నేసింది. ఇప్పటివరకు ఎవరూ టచ్‌ చేయని శుక్ర గ్రహంపై అధ్యయనం జరపాలని నిర్ణయించింది. ఇందులోనూ నాసా సహకారం తీసుకుంటోంది. ఇప్పటికే ఈ దిశగా చర్చలు కూడా జరిపారు ఇరుదేశాల సైంటిస్టులు. ఇలా గగనతలంలో తన ఘనకీర్తిని మరింతగా చాటేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు కదులుతోంది ఇస్రో.


మొత్తంగా.. తొలి ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపినప్పటి నుంచి ఇప్పటిదాకా విజయాలు, వైఫల్యాలు చాలానే చవిచూసిన ఇస్రో... విజయాలు చూసినప్పుడు ఉత్సాహంతో.. వైఫల్యాల్ని చూసినప్పుడు మరింత పట్టుదలతో అంతరిక్ష ప్రయోగాల్లో దూసుకుపోతూనే వుంది. ఏనాడూ ఏ విషయంలోనూ ఇంతవరకు వెనకడుగు వేయకుండా, వెన్ను విరవకుండా ముందడుగు వేస్తోంది.


అందుకే... ఒకప్పుడు మనం ప్రపంచం వైపు చూస్తే... ఇప్పుడు... ప్రపంచమే మనవైపు చూస్తోంది. అయితే... నిప్పులు చిమ్ముతూ నింగికెగురుతున్నవి ఉపగ్రహాలు మాత్రమే కాదు... ఇస్రో ఘనతా,  ఇండియా సత్తా... అందుకే..  ఇస్రో... నీకు నూట నాలుగు వందనాలు. 


మరింత సమాచారం తెలుసుకోండి: