అప్రతిహిత విజయాలతో దూసుకుపోతూ అంతరిక్షంలో అద్భుతాలు సృష్టిస్తున్న ఇస్రో.. మరిన్ని ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపడుతోంది. వచ్చే ఏడాది ప్రారంభంలోనే చంద్రయాన్‌-2 చేపట్టే దిశగా అడుగులు వేస్తోంది. అంతేకాదు.. తన ఖ్యాతిని గ్రహాంతరాలు దాటించిన మంగళ్‌యాన్‌ రెండో దశను కూడా నాసా సహకారంతో చేపట్టబోతోంది. మరోవైపు సూర్యుడిపై అధ్యయనం కోసం ఆదిత్య-1 ఉపగ్రహాన్ని ఇప్పటికే సిద్ధం చేసింది. ఇలా మరో దశాబ్ధానికి సరిపడా తన ఫ్యూచర్‌ ప్లాన్స్‌ను రెడీ చేసుకుంది.


రానున్న కాలంలో ప్రపంచం మొత్తంలో 3వేలకు పైగా ఉపగ్రహాలు నింగిలోకి చేరనున్నాయి. అందులో భారతీయ కంపెనీ ఎయిర్‌టెల్‌ మాతృసంస్థ భారతి గ్రూప్‌ భాగస్వామిగా ఉన్న వన్‌ వెబ్‌ కంపెనీకి చెందిన  648శాటిలైట్లు కూడా ఉన్నాయి. ఇవి ఎలాగూ ఇస్రో ఖాతాలోనే చేరతాయి. ఎందుకంటే కాస్ట్‌ తక్కువ, కన్ఫర్మేషన్‌ ఎక్కువ. ఇవేకాకుండా మిగతా శాటిలైట్లలో మెజార్టీ సంఖ్య ఇండియాకే దక్కనుంది. సో..  భవిష్యత్‌లోనూ అధిక వాటా భారత్‌ సొంతమవడం ఖాయమన్నమాట.


ఇన్ని ప్రయోగాలు చేసినా, ఇంకా చేస్తున్నా... అంతరిక్షంలో భారత స్థానం ఇప్పటికీ అగ్రరాజ్యాల కంటే ఓ మెట్టు కిందే ఉంటోంది. ఎందుకంటే మనదగ్గర లేనిది.. వారి దగ్గర ఉన్నది ఒక్కటే... అదే స్పేస్‌ షటిల్‌ టెక్నాలజీ. అంటే మనుషులను ఆకాశంలోకి పంపలేకపోవడం.ఆ దిశగా ఇస్రో అసలు ప్రయత్నాలే చేయలేదా అంటే అదేమీ కాదు. ఇప్పటికే అటువైపు అడుగులు వేయడం ప్రారంభించింది. అంతరిక్షంలోకి మానవులను పంపే కలను సాకారం చేసుకోవాలంటే పీఎస్‌ఎల్వీని మించిన టెక్నాలజీ కావాలి. మరింత ఎక్కువ దూరం... మరింత ఎక్కువ బరువును మోసుకెళ్లే రాకెట్లను రూపొందించాలి. దీనికోసమే ఇస్రో ప్రత్యేకంగా రష్యాకు చెందిన క్రయోజనిక్‌ ఇంజిన్లతో జీఎస్‌ఎల్వీ-మార్క్‌1 రాకెట్‌ను రూపొందించింది. దీనిద్వారా 2001లో ఉపగ్రహాలను పంపించాలని ట్రై చేసి వైఫల్యం చెందింది. ఆ తర్వాత రెండేళ్లు మళ్లీ పరీక్షించి సక్సెస్‌ కొట్టింది. దాని తర్వాత మళ్లీ విఫలమైంది.


2010లో ఈ రాకెట్‌లో మార్పులు చేసింది. స్వదేశీ క్రయోజనిక్‌ ఇంజన్లు వినియోగించి జీఎస్‌ఎల్వీ-మార్క్‌2ను తీసుకొచ్చింది. తొలినాళ్లలో అదికూడా వైఫల్యాల బాటలోనే నడిచింది. అయితే.. 2014-16వరకు మూడేళ్ల పాటు ప్రయోగించిన ప్రతిసారి విజయవంతమైంది. ఒక్కో మార్పు జరుగుతూ వస్తున్న ఈ రాకెట్‌ వచ్చేనెలలో మరోసారి ప్రయోగానికి సిద్ధమవుతోంది.


అయితే.. ఈ  ప్రయోగాన్ని మరిన్నిసార్లు విజయవంతం చేసినా..... మానవులను అంతరిక్షంలోకి పంపడానికి ఇస్రోకు కనీసంగా మరో దశాబ్ద కాలం పట్టొచ్చు. ఆలోపు మరిన్ని మార్పులు చేసి జీఎస్‌ఎల్వీ-మార్క్‌3ని పూర్తిస్థాయిలో సిద్ధం చేయనుంది ఇస్రో. అయితే.. ఓవైపు ఇస్రో ఈ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నా... మానవసహిత అంతరిక్ష యాత్రకు భారత ప్రభుత్వం మాత్రం ఇంకా లాంఛనంగా అనుమతి ఇవ్వలేదు. 


సో... స్పేస్‌ షటిల్‌ అందుబాటులోకి వచ్చేవరకు మనం మానవులను అంతరిక్షంలోకి పంపలేమన్నది మాత్రం క్లారిటీ. అంటే కనీసం మరో పదేళ్ల వరకు మనం అగ్రరాజ్యాల స్థానాన్ని ఆక్రమించలేమన్నది గ్యారంటీ. అయితే... కాస్త ఆలస్యమైనా ఆ ఘనతను కూడా ఇస్రో అందుకుంటుంది అని చెప్పడానికి ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. సో.. ఆల్‌ ది బెస్ట్‌ ఇస్రో..


మరింత సమాచారం తెలుసుకోండి: