ముఖ్యమంత్రి పదవి ఆశించి భంగపడ్డ పన్నీరు సెల్వం మరోసారి అమ్మ సమాధి దగ్గర ప్రార్ధనలు నిర్వహించారు. అమ్మ చూపిన దారిలో నడుస్తానంటూ ప్రకటిస్తూనే చిన్నమ్మకు వ్యతిరేకంగా పోరాడుతానని ... పార్టీని కాపాడాల్సిన బాధ్యత జయలలిత తనపై ఉంచిందని  ..ఇందుకోసం ఎందాకైనా వెళతానంటూ ప్రకటించారు.  ప్రజామోదం లేనిప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిందంటూ అమ్మ సమాధి సాక్షిగా శశికళపై విమర్శలు గుప్పించి ... తన స్టాండ్ ఏంటో తెలియజేశారు. 


తమిళనాడు ముఖ్యమంత్రిగా పళని స్వామి ప్రమాణ స్వీకారం జరిగిన తరువాత కూడా తమిళ రాజకీయాలు ఉత్కంఠను రేపుతూనే ఉన్నాయి. నిన్నటి వరకు అపధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న  పన్నీరు సెల్వం గురువారం రాత్రి మరోసారి అమ్మ సమాధి చెంతకు చేరుకుని నివాళులు అర్పించారు.  తన మద్ధతుదారులతో కలిసి  నివాళులర్పించారు. తరువాత మాట్లాడుతూ పార్టీని కాపాడాల్సిన బాధ్యత,  అమ్మ తనపై ఉంచిందని .... ఇప్పుడు ఏర్పాటైన ప్రభుత్వానికి కేవలం ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉందని, ప్రజా మద్దతు లేదంటూ విమర్శించారు. పార్టీని శశికళ వారసత్వ పార్టీగా మార్చే కుట్రలు జరుగుతున్నాయంటూ ఆరోపించారు.  ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నవారెవరూ అమ్మ అనుచరులు కాదని ... ప్రభుత్వం శశికళ చేతుల్లోకి వెళ్లిపోయిందంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 


పళని వర్గమంతా శశికళకు ఊడిగం చేయాల్సిందేనంటూ పన్నీరు సెల్వం ఎద్దేవా చేశారు. వేదనిలయంలో శశికళ కుటుంబ సభ్యులు ఉండడాన్ని అంగీకరించమని ... ప్రభుత్వం అసలు రంగు ప్రజలకు వివరించేందుకు ప్రజల ముందుకు వెళ్తానంటూ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి,  లక్ష్యాలు వివరిస్తానని...  జయలలిత మరణానికి శశికళ కుటుంబమే కారణమన్న విషయాన్ని ప్రతి తమిళుడి తెలియజేస్తానంటూ  తేల్చిచెప్పారు. అమ్మ లక్ష్యాలతో పాటు పార్టీని కాపాడి తీరుతానని, అమ్మ ఆశయాలకు వ్యతిరేకంగా ఏర్పడిన ఈ ప్రభుత్వాన్ని కూల్చడమే తన లక్ష్యమంటూ జయ సమాధి సాక్షిగా పన్నీరు సెల్వం శపథం పట్టారు.  


నూతన ముఖ్యమంత్రి పళని స్వామి శనివారమే బలనిరూపణకు సిద్ధమని ప్రకటించడంతో .. పన్నీరు సెల్వం ఈ ప్రకటన చేసినట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పళని స్వామి వెనక ఉన్న ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోవడం ద్వారా ప్రభుత్వాన్ని దెబ్బ తీసే యోచనలోనే ఈ వ్యాఖ్యలు చేసినట్టు సీనియర్లు విశ్లేషిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్ధితుల్లో అదంతా సులభం కాదని చెబుతున్నారు. డీఎంకే, కాంగ్రెస్‌లు మద్ధతు ఇచ్చినా .. పళని స్వామిని ఓడించడం కష్టమంటున్నారు. శశికళతో రాజీకి రావడం లేదంటే చీలిక వర్గంగా కొనసాగుతూ ప్రభుత్వానికి  వ్యతిరేకంగా పోరాడటమే సెల్వం ముందున్న మార్గాలని స్పష్టం చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: