శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీకి కష్టాలు తప్పడం లేదు. భూ కేటాయింపులపై ప్రభుత్వం వెనకడుగు వేయడం ..అరకొర కేటాయింపులతో  ప్రయోజనం లేదంటూ అధికారులు చెప్పడంతో... వచ్చే ఏడాది కూడా క్లాసుల ప్రారంభం అనుమానంగానే మారింది. దీంతో జిల్లా పరిధిలో సీటు పొందినా... విద్యార్ధులు తప్పని సరి పరిస్ధితుల్లో నూజీవీడులో చదువుకోవాల్సిన పరిస్ధితులు నెలకొన్నాయి. 


రాష్ట్ర విభజన తరువాత జిల్లాకు ఎటువంటి జాతీయ స్థాయి విద్యా సంస్థలు కేటాయించకపోవడం పట్ల సిక్కోలు వాసులు  ప్రభుత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. దిగొచ్చిన ప్రభుత్వం ట్రిపుల్ ఐటిని శ్రీకాకుళంకి మంజూరు చేసింది. గ్రామీణ విద్యార్ధులకు ట్రిపుల్ ఐటి వరప్రదాయిని అయినప్పటికీ జిల్లాలో దాని ఏర్పాటు మౌళిక వసతుల కల్పనపై కొనసాగుతున్న జాప్యం వారిని అసహనానికి గురిచేస్తుంది. అటు నూజివీడు, కడపలలో ట్రిపుల్ ఐటిలు విద్యార్ధులకు పూర్తి స్థాయి వసతి సౌకర్యాలతో కొనసాగుతుండగా శ్రీకాకుళంజిల్లాలోని ట్రిపుల్ ఐటికి మాత్రం కేవలం 50 ఎకరాలతో పాటు 21వ శతాబ్ధపు గురుకుల భవనాలు కేటాయించడం పట్ల విద్యా రంగ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


2015లో ట్రిపుల్ ఐటీని కేటాయించిన ప్రభుత్వం 2016 నుంచే క్లాసులు ప్రారంభం కావాలని భావించింది. అయితే ఆశించిన స్ధాయిలో పనులు జరగకపోవడంతో  ఈఏడాది నూజీవీడులోనే క్లాసులు నిర్వహించి వచ్చే ఏడాది నుంచి ఇక్కడే ప్రారంభించాలని నిర్ణయించారు. ట్రిపుల్ ఐటీ ప్రధానంగా స్ధల సేకరణలో  తీవ్రంగా జాప్యం జరుగుతోంది. విద్యార్ధుల భోదనతో పాటు వసతి సౌకర్యాలు కల్పించేందుకు 350 ఎకరాలు కావాలని గతంలో అధికారులు నిర్ణయించారు.

ఈ దిశగా గత ఏడాది  ఎచ్చెర్లలో 21వ శతాబ్ధపు గురుకులంకి చెందిన స్థలంతో పాటు దానికి ఆనుకుని ఉన్న 340 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కేటాయింపులు జరిగి రెండు నెలలు కూడా కాకముందే గతంలో జారీ చేసిన జీవోను రద్దు చేస్తూ తాజాగా 21వ శతాబ్ధపు గురుకుల భవనాలతో పాటు దానికి సంబందించిన 50 ఎకరాలను మాత్రమే ట్రిపుల్ ఐటికి కేటాయిస్తూ జీవో జారీ చేశారు. దీంతో పరిస్ధితి మళ్లీ మొదటికి వచ్చింది.  ఏడాదికి వెయ్యి మంది చొప్పున వచ్చే ట్రిపుల్ ఐటీలకు కేవలం 50 ఎకరాలు కేటాయిస్తే ఎందుకు సరిపోవని అధికారులు తెగేసి చెప్పారు. వసతులతో పాటు క్లాసులు నిర్వహించాలంటే 350 ఎకరాలు కావాల్సిందేనని చెబుతున్నారు.  


ప్రభుత్వం మాత్రం తన నిర్ణయాన్నే సమర్దించుకుంటోంది. ఇప్పటికి రెండు నెలలు గడిచినా  భూ కేటాయింపులపై దృష్టి సారించకపోవడంతో వచ్చే ఏడాదైన క్లాసులు ప్రారంభం అవుతాయో లేదోననే ఆందోళన జిల్లా వాసులు, విద్యార్ధులు, వారి తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది.  ప్రభుత్వ తీరుతో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు అలంకార ప్రాయంగా మారిదంటూ జిల్లా వాసులు ఆరోపిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: